దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం

దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం
 

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌తో పాటు అనేక దేశాల్లో చంద్రగ్రహణం కనిపించింది. గ్రహణ ప్రారంభవేళ అరుణవర్ణంలో చంద్రబింబం అలరించింది. తదనంతరం నెమ్మదిగా గ్రహణం విస్తరించడంతో చంద్రహోయలు మరింత శోభతో ఆకట్టుకున్నాయి. అయితే మేఘావృతంతో పలుచోట్ల గ్రహణ వీక్షకులకు తీవ్ర నిరాశ ఎదురైంది.

 
మరోవైపు గ్రహణం వేళల్లో దేశవ్యాప్తంగా ఆలయాలన్నింటిని మూసివేశారు. తిరుమల, విజయవాడ, శ్రీశైలం ఆలయ ప్రధాన ద్వారాలకు తాళాలు వేశారు. భారత్‌లో ఆదివారం రాత్రి 9.56 గంటలకు ఇది ప్రారంభమైంది. ఇక రాత్రి 11 గంటలకు ‘సంపూర్ణ చంద్రగ్రహణం’ మొదలైంది. ఇది తర్వాతి రోజు (సోమవారం) ఉదయం 12.22 గంటలకు ఇదీ వీడింది. అంటే 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడలోనే చంద్రుడు ఉన్నాడు. 
 
రాత్రి పూట 11.41 ప్రాంతంలో చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి నీడ అడ్డుపడిన దశలో చంద్రుడు ఎరుపు రంగులో కన్పించిన ఘట్టం బ్లడ్‌మూన్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే సోమవారం ఉదయం 2:25 గంటలకు చంద్రగ్రహణం వీడింది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపై వచ్చినప్పుడు ఈ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
కాగా ఈ చంద్రగ్రహణాన్ని చూసేందుకు పెద్దలు, చిన్నారులు ఆసక్తి కనబర్చారు. టెలీస్కోప్‌ల ద్వారా ఈ దృశ్యాన్ని వారు వీక్షించారు. 
ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం.. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది.