తెలంగాణ విమోచన దినోత్సవంకు రాజ్ నాథ్ సింగ్

తెలంగాణ విమోచన దినోత్సవంకు రాజ్ నాథ్ సింగ్
వరుసగా మూడవ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంను అధికారికంగా హైదరాబాద్ లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ సంవత్సరం ఈ ఉత్సవాలలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్యఅతిధిగా పాల్గొననున్నారు. కాగా, ఆ రోజున  సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్కులో దివంగత మాజీ ప్రధాని ఎబి వాజ్‌పేయ్ విగ్రహాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించనున్నారు. 
తెలంగాణ విమోచన దినోత్సవం 2025ను విజయవంతంగా నిర్వహించడానికి హైదరాబాద్‌లోని నగర బిజెపి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో సెప్టెంబర్ 17 వేడుకల కోసం సమగ్ర ప్రణాళిక, భద్రతా ఏర్పాట్లు, ఇతర కార్యక్రమాల షెడ్యూల్ గురించి దిశానిర్దేశం చేశారు.

నిజాం, రజాకార్ల నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరాకరిస్తూ వచ్చాయి. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బిజెపి అనేక పోరాటాలు చేస్తూ వస్తోంది. 
 
రాష్ట్ర ప్రభుత్వం విస్మరించినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న అధికారిక తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది.  ఈ ఏడాది కూడా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా నిర్వహించనుంది.  కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ కుమార్ లతో పాటు మహారాష్ట్రకు చెందిన మంత్రులు, రాష్ట్ర పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.