జీఎస్టీ సంస్కరణల గురించి దేశవ్యాప్తంగా ప్రచారం

జీఎస్టీ సంస్కరణల గురించి దేశవ్యాప్తంగా ప్రచారం

* మద్దతు తెలిపినందుకు రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్ లేఖ

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) స్వరూపంలో కీలక మార్పులు చేసిన కేంద్రప్రభుత్వం, ఇప్పుడు కొత్త సంస్కరణల గురించి వ్యాపారులు సహా ప్రజలకు తెలియజేయడానికి దేశవ్యాప్తంగా ప్రచారం కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. సెప్టెంబరు 22 నుంచి కొత్త పన్ను రేట్లు అమల్లోకి రానుండగా, దేశంలోని ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన ప్రతినిధి అనిల్ బలూని తెలిపారు.

“జీఎస్టీ సంస్కరణలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ పూర్తి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. జీఎస్టీ సంస్కరణల గురించి సామాన్య ప్రజలకు తెలియజేయాలని మేం రాష్ట్రాలు, జిల్లాల్లోని మా యూనిట్లను కోరాం” అని పార్టీ ప్రధాన ప్రతినిధి అనిల్ బలూని తెలిపారు. ప్రతి జిల్లాలో జీఎస్టీ సంస్కరణల గురించి ప్రజలకు తెలియజేయడానికి ‘చౌపల్స్’ నిర్వహించాలని ప్లాన్ చేశామని చెప్పారు. అందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.

జీఎస్టీ సంస్కరణలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలను బీజేపీ నిర్వహించనుందని బలూని చెప్పారు. సీనియర్ కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శుల విలేకరుల సమావేశాలు ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతాయని తెలిపారు. ఈ విషయంలో పార్టీ త్వరలో మరిన్ని వివరాలను పంచుకుంటుందని వెల్లడించారు. ప్రణాళికలను ప్రకటిస్తుందని చెప్పారు.

మరోవైపు, జీఎస్‌టీ సంస్కరణలకు మద్దతు తెలిపినందుకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లేఖ రాశారు. పన్ను రేట్లను సవరించడంలో రాష్ట్రాలు భిన్న అభిప్రాయాలు తెలియజేశాయిని, అయినప్పటికీ ఏకాభిప్రాయానికి రావడం గొప్పవిషయమని ఆమె పేర్కొన్నారు. సంస్కరణలకు మద్దతు తెలిపినందుకు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

జీఎస్టీలో సంస్కరణలను అమలు చేయడంలో వారి మద్దతు, చురుకైన పాత్రకు కృతజ్ఞతలు తెలిపారు. “నిన్న, నేను ప్రతి ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ రాశాను. మీరు తీవ్రమైన చర్చలు, వాదనలు జరపవచ్చు, కానీ చివరికి, కౌన్సిల్ సందర్భానికి తగ్గట్టుగా స్పందించి భారతదేశ ప్రజలందరికీ ఉపశమనం కలిగించారు. అందుకే లేఖ రాశాను” అని నిర్మల తెలిపారు.