విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్‌కు అప్పగిస్తారా?

విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్‌కు అప్పగిస్తారా?

భారత్‌లోని వివిధ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని, వాటిని చెల్లించకుండా దేశం విడిచి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చి వారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. విజయ్ మాల్యా , నీరవ్ మోదీ, సంజయ్ భండారీ లాంటి ఆర్థిక నేరగాళ్లు భారత్‌లో వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయి బ్రిటన్‌లో జీవిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే భారత ఆర్థిక నేరగాళ్లను తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తులు చేస్తోంది.  ఈ క్రమంలోనే ఢిల్లీలోని తీహార్‌ జైలును బ్రిటన్ అధికారులు సందర్శించడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రిటన్‌‌కు చెందిన క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ బృందం గత జులైలోనే తీహార్‌ జైలుకు వచ్చి అక్కడ పరిశీలించినట్లు తీహార్ జైలు వర్గాలు వెల్లడించాయి. 

జైలులో సెక్యూరిటీ, ఖైదీలకు కల్పించే సౌకర్యాలను బ్రిటన్ అధికారులు పరిశీలించినట్లు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక నేరగాళ్లను మనకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.  కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధిపతి విజయ్ మాల్యా భారత్‌లోని పలు బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్లు బ్యాంకు లోన్లు ఎగవేసి దేశం విడిచి పారిపోయారు. 2016లో భారత్ విడిచి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా ఇప్పుడు అక్కడే నివసిస్తున్నారు.

ఇక 2018లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు దాదాపు రూ.14 వేల కోట్ల రుణాలు ఎగవేసి.. నీరవ్‌ మోదీ కూడా విదేశాలకు పారిపోయారు. ఇక ఈ నీరవ్ మోదీ కేసును ఇప్పుడు సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే నీరవ్‌ మోదీ ఆస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  మరోవైపు నీరవ్‌ మోదీ తమ దేశంలోనే ఉన్నారని, 2018 డిసెంబర్‌లో బ్రిటన్‌ ప్రభుత్వం వెల్లడించింది.

ఈ క్రమంలోనే నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని కేంద్రం విజ్ఞప్తి చేయగా, అతడిని 2019లో బ్రిటన్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ సర్కార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత జైళ్లలో సరైన సౌకర్యాలు లేవని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని యూకే కోర్టులు పలు సార్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అందువల్లే అప్పగింత అభ్యర్థనల్లో ఆలస్యం జరిగింది.

ఈ అడ్డంకిని తొలగించేందుకు భారత అధికారులు భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిందితులకు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.  ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రస్తుతం భారత్ తరఫున ప్రపంచవ్యాప్తంగా 178 అప్పగింత అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో దాదాపు 20 యూకేలోనే ఉన్నాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ కేసులు అత్యంత కీలకంగా మారాయి.