
భారత్-అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉందని, ప్రధాని మోదీతో స్నేహంగా ఉంటానని పేర్కొనడమే కాకుండా మోదీ గొప్ప ప్రధాని అంటూ కొద్దీ రోజులుగా భారత్ పై విమర్శలు చేస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వరం మార్చడం పట్ల ప్రధాని అభినందనలు తెలిపారు. ట్రంప్ సానుకూల వైఖరి అభినందనీయమంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. భారత్, అమెరికా మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
అమెరికాకు భారత్ దూరమైందని, చీకటి చైనా చేతిలోకి పోయిందని అన్న కొద్ది గంటలకే భారత్ తో పాటు ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్- అమెరికా సంబంధాలు చాలా ప్రత్యేకమైనవిగా ట్రంప్ అభివర్ణించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాను ఎప్పుడూ స్నేహంగానే ఉంటానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా భారత్ సంబంధాలపై న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఆసక్తికర సమాధానం చెప్పారు.
భారత్‌తో సంబంధాలను మళ్లీ రీసెట్ చేసేందుకు సిద్ధమా? అని ఏఎన్ఐ అడగ్గా ట్రంప్ ఇలా చెప్పారు. “నేను ఎల్లప్పుడూ మోదీతో స్నేహంగానే ఉంటాను. ఆయన గొప్ప ప్రధానమంత్రి. మా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతుంది, కానీ ఆయన చేస్తున్న కొన్ని పనులు నాకు నచ్చడం లేదు” అని చెప్పుకొచ్చారు. “భారత్, అమెరికాల మధ్య చాలా ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయి. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా మధ్య అప్పుడప్పుడు కొన్ని భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటాయి” అని ట్రంప్ తెలిపారు.
భారత్‌తో వాణిజ్య ఒప్పందాల పురోగతి గురించి ప్రశ్నించినప్పుడు, అవి బాగా సాగుతున్నాయని ట్రంప్ చెప్పారు. అయితే గూగుల్ వంటి అమెరికా టెక్ దిగ్గజాలపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) విధించిన భారీ జరిమానాల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అన్యాయమని, అటువంటి వివక్షపూరిత చర్యలను తమ ప్రభుత్వం అంగీకరించబోదని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక