భారతీయ వస్తువులపై ట్రంప్ సుంకాలు స్వల్పకాలికమే

భారతీయ వస్తువులపై ట్రంప్ సుంకాలు స్వల్పకాలికమే
భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు స్వల్పకాలికమే కావచ్చని భారత ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారుడు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఎందుకంటే సుంకాలు రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. రష్యన్ చమురు కొనుగోలుపై అమెరికా విధించిన 25 శాతం సుంకాలు వ్యాపారాలను చాలా సవాలుగా మారుస్తాయని ఆయన చెప్పారు. 
టారిఫ్ ప్రతికూల ప్రభావాలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో, మూడో త్రైమాసికాలలో ఉండొచ్చని హెచ్చరించారు. పరిస్థితి మారకపోతే సుంకాల ప్రభావం తదుపరి ఆర్థిక సంవత్సరం వరకు ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. “భారత్ పై అమెరికా విధించిన అధిక సుంకం ఆశించిన ఫలితాలను ఇవ్వదు, ప్రతికూలంగా ఉంటుందని యూఎస్ గ్రహించినట్లు సంకేతాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పరిస్థితులను చూస్తుంటే అదనపు సుంకాలు (25 శాతం) దీర్ఘకాలికం కంటే స్వల్పకాలికంగా ఉంటాయని అర్థమవుతోంది” అని స్పష్టం చేశారు. 

“రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, బ్రెజిల్- అమెరికా నుంచి అధికంగా 50 శాతం టారిఫ్లను ఎదుర్కొంటున్నాయి. రష్యా, చైనా సహా మరికొన్ని దేశాలు భారత్పై అధిక సుంకాలను ఖండిస్తున్నాయి” అని అనంత నాగేశ్వరన్ గుర్తు చేశారు. అయితే, ఇటీవల జీఎస్టీ విధానంలో తీసుకొచ్చిన మార్పులు దేశంలో వినియోగాన్ని పెంచుతుందని భావిస్తున్నట్లు నాగేశ్వరన్ తెలిపారు. ఎగుమతి నష్టాలను భర్తీ చేసే పరిమాణంలో ఇది ఉంటుందా? అనేది ప్రశ్నని పేర్కొన్నారు.  

ఈ సుంకాలు తదుపరి ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగితే ఉపాధి, జీడీపీ వృద్ధి పరంగా భారత్కు భారీ సవాళ్లు ఎదురవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ తమ వస్తువుల ఎగుమతుల కోసం ఇతర మార్కెట్లను వెతకడం అంత సులువైన పని కాదని స్పష్టం చేశారు.  “ఈ ఏడాది మొదటి నాలుగు నెలలు భారతీయ ఎగుమతులపై అమెరికా ఎలాంటి సుంకాలు వేయలేదు. కాబట్టి ఈ ఏడాది (అదనపు 25 శాతం సుంకం) ప్రభావం ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో ఉంటుంది. సుంకాలు-మినహాయింపులు, సుంకాలు- ప్రభావిత రంగాల గురించి అంచనాలు మారుతూ ఉంటాయి” అని తెలిపారు. 

“కానీ దురదృష్టవశాత్తు అనిశ్చితి, మూలధన నిర్మాణం, ఉపాధిపై రెండో, మూడో రౌండ్ ప్రభావాల గురించి బహుళ అంచనాలు ఉన్నాయి. రెండో, మూడో మూడవ త్రైమాసికాలలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిపై ప్రభావం ఉంటుందని నేను భావిస్తున్నాను” అని అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు.