గాజాలో 64 వేలు దాటిన మృతులు

గాజాలో 64 వేలు దాటిన మృతులు

హమాస్‌, ఇజ్రాయెల్‌ దాడులు రెండేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్‌ తుదముట్టించే వరకు గాజాపై దాడులు చేస్తామంటూ ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. దీంతో గాజా స్ట్రిప్‌లో ఇప్పటివరకు 64 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. 2023, అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లోని హమాస్‌ దాడికి పాల్పడింది. దీంతో 1200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు చనిపోయారు. 

మరో 251 మందిని బందీలుగా హమాస్‌ పట్టుకెళ్లింది. ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులకు పాల్పడుతున్నది. దీంతో ఉగ్రవాదులు ఎంతమంది చనిపోయారో తెలియనప్పటికీ, మహిళలు, చిన్నారులు, సాధారణ పౌరులు మాత్రం నెతన్యాహూ సైన్యానికి బలవుతూనే ఉన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 64,231 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 400 మందికిపైగా ఆచూకీలేకుండా పోయారని తెలిపింది.

మృతుల్లో సగానికిపైగా మహిళలు, చిన్నారులు ఉన్నారని పేర్కొంది. తాజాగా నిరాశ్రయులైన వారిపై ఇజ్రాయెల్‌ దాడికి పాల్పడిందని, దీంతో 25 మంది మరణించారని గాజా సిటీలోని షిఫా హాస్పిటల్‌ వర్గాలు వెల్లడించాయి. వారిలో తొమ్మిదిమంది చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారని తెలిపారు.

కాగా, ఇజ్రాయిల్‌ తమ షరతులకు అంగీకరిస్తే యుద్ధ విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని సాయుధ తిరుగుబాటు సంస్థ హమాస్‌ స్పష్టం చేసింది. గాజా నిర్వహణకు స్వతంత్ర జాతీయ పరిపాలన ఏర్పాటు చేయాలని సూచించింది. ఇజ్రాయిల్‌ బందీలను విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అయినప్పటికీ ఇజ్రాయిల్‌ దురాక్రమణ చర్యలు ఆగడం లేదని ఆరోపించింది. 
 
మరోవంక, గాజా నగరంలోని నివాస ప్రాంతాలు, తాత్కాలిక శిబిరాలపై ఇజ్రాయిల్‌ బాంబు దాడులను తీవ్రతరం చేస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచి జరిపిన క్షిపణి దాడుల్లో కనీసం 45 మంది పాలస్తీనియన్లు మరణించారు.