బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అన్నదమ్ముల్లాంటివి

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అన్నదమ్ముల్లాంటివి

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అన్నదమ్ముల్లాంటివని, అవినీతికి కవలపిల్లలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యదర్శుల సమ్మేళనంలో మాట్లాడుతూ  బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, ఆ పార్టీకి చెందిన కుటుంబ సభ్యులే, ఎమ్మెల్సీలే బయటపెడుతున్నారని గుర్తు చేశారు. 
 
అవినీతి సొమ్మును పంచుకోవడంలో విభేదాలు తలెత్తడంతో ఈ విషయాలు చెబుతున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కుటుంబం మాత్రమే బాగుపడిందని, కానీ కాళేశ్వరం, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు.  ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక, అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో హైకోర్టులో పిటిషన్ వేసి ఎన్నికలు వాయిదా వేయమని అడిగిందని రామచందర్ రావు ఆరోపించారు. 

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందని చెబుతూ ప్రజల్లో మొహం చూపెట్టలేక.. పార్టీ నాయకులు కాకుండా, రాష్ట్ర ఇంచార్జ్‌లతో పాదయాత్ర చేయాల్సిన స్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు కానీ తెలంగాణలో పరిపాలనను గాలికొదిలేశారని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని,  ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి. కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.  జాబ్ క్యాలెండర్ ప్రకటించినా, ఎక్కడా నోటిఫికేషన్లు లేవని, ఉద్యోగాలివ్వడం లేదని, చెబుతూ గతంలో బీఆర్‌ఎస్ మోసం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ మోసం చేస్తోందని ధ్వజమెట్టారు.

యువ, రైతు, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు చేశామని కాంగ్రెస్ చెబుతోంది కానీ అమలు చేయడం లేదని తెలిపారు. గతంలో ప్రజలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చారుని, కానీ రెండు పార్టీలతోనూ మేలు జరగలేదని,  ఇప్పుడు ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని రామచందర్ రావు చెప్పారు.  గ్రామాగ్రామాన, పల్లెపల్లెకి వెళ్లి మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

తెలంగాణలో అవినీతిరహిత, అభివృద్ధితో కూడిన ప్రభుత్వం కావాలని చెప్పారు. పేర్కొంటూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా, ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని పేర్కొంటూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది కేవలం బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు.  బీఆర్‌ఎస్ పార్టీ దోచుకుంది, ఇక దోచుకోవడానికి ఏమీ మిగల్లేదనేలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.