
బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత చెప్పింది కొంతేనని, ఇంకా చెప్పాల్సింది చాలా ఉందని బిజెపి లోక్‌సభ సభ్యుడు రఘునందన్ రావు తెలిపారు. కవిత అంత తొందరగా వదలరని పార్టీని స్థాపించి తీరుతారని చెప్పారు. కాగా, కవిత చెబుతున్న విషయాలను తాము చాలా కాలంగా చెబుతూనే ఉన్నామని ఆయన గుర్తు చేశారు.
అవినీతి పునాదులపై బిఆర్ఎస్ ఉందని ఆయన విమర్శించారు. కవిత ఇంకా పెద్దలు చేసిన అవినీతిని బయట పెడితే బాగుండేదని సూచించారు. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్‌రావు మోకిల్లా ప్రాజెక్టు అవతవకలు, అక్రమాల గురించి కూడా ఆమె బయట పెట్టాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మోకిల్లాలో జరుగుతున్న విల్లా ప్రాజెక్ట్‌పై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అలాగే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావులపై వెంటనే ఏసీబీ డీజీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన సూచించారు.
సంతోష్ రావు వియ్యంకుడి హోదాలో మాత్రమే సందీప్ రావు అనేక అరాచకాలు చేశారని, అతడి ద్వారానే సంతోష్ రావు సెటిల్మెంట్లు చేసేవారని ఆరోపించారు. దుబ్బాకకు కేసీఆర్ కుటుంబం చేసిన అన్యాయం గురించి తాను అనేక సార్లు చెప్పానని పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్సీలపై పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదంటూ కవితను ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. అలాగే నగర శివార్లలోని ల్యాండ్ కన్వర్షన్ చేసిన భూములు విషయం సైతం చెప్పాల్సిందని పేర్కొన్నారు.
దుబ్బాకకు హరీష్ రావు వల్లే అన్యాయం జరిగిందని కూడా తాను ఆనాడే చెప్పానని తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి టి. హరీష్ రావు కుమ్మక్కైయ్యారని తాను చాలా కాలంగా చెబుతున్నానని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇరువురూ ఒకే విమానంలో, పక్కపక్క సీట్లలో కూర్చుని ప్రయాణం చేసినప్పుడే తన ఓటమికి కుట్ర చేశారని ఆయన తెలిపారు. జెడ్పి చైర్మన్‌గా తనను ఎవరు ఓడించారో కూడా తాను కెసిఆర్ దృష్టికి తీసుకెళ్ళానని ఆయన చెప్పారు.
కాళేశ్వరం విచారణపై రెండేళ్ళ సమయం వృధా చేసిందంటూ రేవంత్ రెడ్డిప్రభుత్వంపై బిజెపి ఎంపీ మండిపడ్డారు. సంతోష్ రావు ఈ స్థాయిలో ఆస్థులు ఎలా సంపాదించారో కూడా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే తాను ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల మెదక్ ఎంపీగా గెలవలేదని స్పష్టం చేశారు. ఇది నూటికి నూరు శాతం కరెక్ట్ అని ఆయన పేర్కొన్నారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి