సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించిన ప్రభుత్వం

సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించిన ప్రభుత్వం

కర్నూలు జిల్లాకు చెందిన మైనర్‌ బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ కేసుపై సమీక్షించిన సీఎం వెంటనే దర్యాప్తు సంస్థకు లేఖ రాసి తక్షణమే దర్యాప్తు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసు దర్యాప్తును నీరు గార్చేశారు. సీబీఐకి అప్పగిస్తున్నట్లు మొక్కుబడిగా జీవో జారీ చేసి చేతులు దులిపేసుకున్నారు.

ఆ సంస్థ దర్యాప్తు చేపట్టేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలోనే అప్పట్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రీతి కుటుంబం తరఫున పోరాటం చేశారు. వారికి అండగా నిలబడ్డారు.  సుగాలి ప్రీతి కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాల వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదివేది. ఈ బాలికపై వేధింపులకు పాల్పడి చంపేశారని, తర్వాత ఆధారాలను మాయం చేసి ఆత్మహత్యగా చూపేందుకు ప్రయత్నించారంటూ 2017 ఆగస్టు 19న కర్నూలు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఐపీసీ 302, 201 రెడ్‌విత్‌ 34, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంలోని 3(2) (వీ), పోక్సో చట్టంలోని సెక్షన్‌ 10 కింద ఈ కేసు పెట్టారు.  పాఠశాల యాజమాన్యం ప్రతినిధులైన కె. జనార్దన్‌రెడ్డి, కె. హర్షవర్ధన్‌రెడ్డి, కె. దివాకర్‌రెడ్డిలను మొదట నిందితులుగా పేర్కొన్నారు. తర్వాత దాఖలు చేసిన అభియోగపత్రంలో మాత్రం అత్యాచారం, హత్య సెక్షన్లు తొలగించారు. నిందితులు ఆత్మహత్యకు పురిగొల్పారని పేర్కొంటూ కొత్తగా ఐపీసీ 306 సెక్షన్‌ను పొందుపరిచారు. 

అయితే ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు అప్పట్లో ఆందోళన చేపట్టారు. అత్యాచారం, హత్య జరిగినట్లు వైద్య నివేదికల్లో తేలినప్పటికీ నిందితుల్ని కాపాడేందుకు ఆ సెక్షన్లు తొలగించి అభియోగపత్రం దాఖలు చేశారని ఆరోపిస్తూ ఉద్యమించారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం దర్యాప్తును నీరుగార్చేసింది.

జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ బాధితురాలి తరఫున అప్పట్లో ఆందోళనలు చేశారు. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు 2020 ఫిబ్రవరి 27న జీవో జారీ చేసింది. కానీ సీబీఐ దర్యాప్తు బాధ్యతలు చేపట్టేలా ఏ మాత్రం చర్యలు తీసుకోలేదు. కాగా, డిఎన్ఏ పరీక్ష నివేదికను తారుమారు చేసి ఈ కేసును జగన్ ప్రభుత్వం నీరుగార్చిందని గత వారం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కాగా,  ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.