ఎమ్మెల్సీ పదవికి, బిఆర్ఎస్ కు కవిత రాజీనామా

ఎమ్మెల్సీ పదవికి, బిఆర్ఎస్ కు కవిత రాజీనామా
* రేవంత్ రెడ్డితో హరీష్ రావు కుమ్మక్కు
 
ఎమ్మెల్సీ పదవికి,  బీఆర్ఎస్​ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మంగళవారం సాయంత్రం ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం, బుధవారం  హైదరాబాద్​లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పదవులు పోతే, పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తే పోయే బంధం తమది కాదని వ్యాఖ్యానించారు. 
 
వ్యక్తిగత లబ్ధి పొందాలనే ఆలోచనతో పార్టీలో కొందరు ఉన్నారని, కేసీఆర్​, కేటీఆర్​, తాను కలిసి ఉండకూడదని, తమ కుటుంబం బాగుండొద్దని కోరుకుంటున్నారని అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ను హస్తగతం చేసుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయని పేర్కొంటూ మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే విమానంలో ప్రయాణం చేసినప్పటి నుంచి తనపై కుట్రలు ప్రారంభమయ్యాయని ఆమె ఆరోపించారు. 
 
మీరిద్దరూ ఒకే విమానంలో కలిసి వచ్చారా? లేదా అనేది రేవంత్, హరీష్ చెప్పాలని ఆమె నిలదీశారు. సామాజిక తెలంగాణపై మాట్లాడితే పార్టీ పెడుతున్నానని దుష్ఫ్రచారం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌తో కొట్లాడుతున్నాం కాబట్టే కెసిఆర్ కుటుంబంపై కుట్రలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. హరీష్ రావు పాల వ్యాపారంపై ఆరోపణలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. 
 
“రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ అంటారు. కానీ హరీష్‌రావు గురించి మాట్లాడరు. కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ వచ్చిందంటే అందుకు కారణం హరీష్‌రావు, సంతోష్‌రావే. కేసీఆర్‌తో మొదటి నుంచి హరీష్‌రావు లేరు. టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా ఎందుకు ఈ నిర్ణయం అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు. హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్” అంటూ కవిత మండిపడ్డారు. 
 
“కేసీఆర్‌కు హరీష్‌రావు కట్టప్ప లాగా అంటారు. హరీష్‌రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశారు. నా ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వను. నాపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా?” అంటూ ఆమె కంటతడి పెట్టుకున్నారు.
 
“కేటీఆర్‌ను గడ్డం పట్టుకుని అడుగుతున్నా. నాపై కుట్రలు జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మీరు ఏం చేశారు?. నాపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా కేటీఆర్ నుంచి ఫోన్ కూడా రాలేదు. మహిళా నేతలు కూర్చోని నాపై ప్రెస్‌మీట్ పెట్టారు. అది మంచిదే. అదే నేను కోరుకున్నది. కొందరు మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. అందుకే నన్ను పార్టీ నుంచి బయటపడేశారు. పార్టీని అస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారు. రేపు కేటీఆర్‌కు ఇదే జరుగుతుంది.. కేసీఆర్‌కు ఇదే జరుగుతుంది” అంటూ ఆమె హెచ్చరించారు.
 
“వీరివల్లే విజయశాంతి, మైనంపల్లి, ఈటల సహా ఎంతోమంది పార్టీని వీడారు. ఉప ఎన్నికల్లో ఈటలను హరీష్‌రావే దగ్గరుండి గెలిపించారు. ఈ విషయాలను కేటీఆర్ గుర్తించాలి” అంటూ కవిత హితవు చెప్పారు.