దోషులుగా తేలిన వారికి భారత్ లో ప్రవేశం లేదు

దోషులుగా తేలిన వారికి భారత్ లో ప్రవేశం లేదు

దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి దోషులుగా తేలిన వారిని భారత్ లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని కేంద్రం వెల్లడించింది. దీంతో పాటు గూఢచర్యం, అత్యాచారం, హత్య, ఉగ్రవాద చట్టాలు, పిల్లల అక్రమ రవాణా, నిషేధిత సంస్థల్లో సభ్యులుగా ఉన్నవారిని దేశంలోకి రానివ్వమని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ప్రవేశపెట్టిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ యాక్ట్ 2025 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

దీని ప్రకారం ప్రతి రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు ఇందుకోసం చర్యలు తీసుకోవాలని సూచించింది. వీరిని దేశం నుంచి బహిష్కరించే వరకూ భారత్లో తిరగకుండా ప్రత్యేక తనిఖీ కేంద్రాలు, నిర్భంద క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పింది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్‌ కోసం రిజిస్ట్రేషన్‌తో సహా ఏదైనా వీసా కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి విదేశీ పౌరుడు తన బయోమెట్రిక్ సమాచారాన్ని తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం పేర్కొంది. 

ఒకవేళ ఎవరైనా అక్రమ చొరబాటుదారుడు భారత్లో పట్టుపడితే దేశంలో తిరగకుండా నిర్భంద క్యాంపుల్లో పెట్టి స్వస్థలానికి తరలిస్తామని హెచ్చరించింది. ముఖ్యంగా అక్రమ చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశించకుండా సరిహద్దు గస్తీ దళాలు, కోస్ట్ గార్డ్ చర్యలు తీసుకోవాలని చెప్పింది. వారి వద్ద నుంచి వ్యక్తిగత వివరాలు తెలుసుకుని కేంద్రం రూపొందించిన పోర్టల్లో నమోదు చేయాలని సూచించింది.

“దేశ వ్యతిరేక కార్యకలాపాలు, గూఢచర్యం, అత్యాచారం, హత్య, మానవ అక్రమ రవాణా, ఉగ్రవాద కార్యకలాపాలు, మనీ లాండరింగ్, హవాలా, మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైమ్ కేసుల్లో విదేశీ పౌరులు దోషులుగా తేలితే భారత్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఉండదు. ఇంకా భారత్లో ఉద్యోగం చేసేందుకు చెల్లుబాటు అయ్యే వీసా ఉన్న విదేశీ పౌరులు, అధికారుల అనుమతి లేకుండా విద్యుత్, నీటి, పెట్రోలియం రంగాల్లోని ప్రైవేట్ సంస్థలు పనిలో పెట్టుకోకూడదు” అని స్పష్టం చేసింది.

ఒక విదేశీ పౌరుడు ఏదైనా ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, రియాలిటీ టెలివిజన్, వెబ్ షోలు లేదా సిరీస్, టీవీ సీరియల్స్ లేదా షోలు లేదా ఇతర మాధ్యమాల్లోనైనా నిర్మిస్తుంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొంది. దీంతో పాటు విదేశీయలు చేసే పర్వతారోహణ యాత్రలపైనా కేంద్రం ఆంక్షలు విధించింది. 

ముందస్తు అనుమతి లేకుండా విదేశీ పౌరుడు లేదా విదేశీ గ్రూపు దేశంలోని ఏ పర్వత శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నించకూడదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా విదేశీ పౌరుడు ఏదైనా నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి లేదా ఉండేందుకు అనుమతి పొందాల్సి ఉంటుందని చెప్పింది. ముఖ్యంగా ఆఫ్గానిస్థాన్, చైనా, పాకిస్థాన్లో జన్మించిన ఎవరైనా నిషేధిత ప్రాంతాలను సందర్శించేందుకు అనుమతి లేదని పేర్కొంది. 

అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, జమ్మూ కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరాఖండ్, లద్ధాఖ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ సహా కొన్ని రాష్ట్రాలు నిషేధిత ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. విదేశాలకు చెందిన నావికులు, విమాన సిబ్బంది భారత్లోకి ప్రవేశించేందుకు ల్యాండింగ్ పర్మిట్, షోర్ లీవ్ పాస్, భారత వీసా ఉండాలని సూచించింది.

కాగా, కొన్ని సందర్భాల్లో విదేశీ పౌరులను దేశం వదిలి వెళ్లేందుకు అనుమతి ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలోని ఏదైనా కోర్టులో వారు హాజరు కావాల్సిన అవసరం ఉన్నా, వారిని పంపిస్తే ఇతర దేశాలతో సంబంధాలు చెడిపోతాయని భావించినా భారత్ విడిచి వెళ్లేందుకు అనుమతించబోమని తెలిపింది. ఇంకా వారు ఏదైనా ప్రమాదకర వ్యాధులతో బాధపడుతున్నా, కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినా దేశం వదిలి వెళ్లేందుకు నిరాకరిస్తామని వివరించింది.