పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి సంచల ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్‌కుమార్, టి. రవీందర్రావు పేరిట ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్కి నష్టం కలిగించేలా ఉన్నాయని, అధిష్ఠానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని లేఖలో పేర్కొన్నారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
గత కొంతకాలంగా కవిత పార్టీ లైన్‌కు భిన్నంగా మాట్లాడడం, పార్టీపై విమర్శలు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతోందంటూ ఆమె చేసిన షాకింగ్ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆమె కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు, బీఆర్ఎస్ నేత సంతోష్‌రావులపై సోమవారం తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. ఈ పరిణామాలే చివరకు కవితను పార్టీ నుంచి బహిష్కరించడానికి దారితీశాయని భావిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత కవిత భవిష్యత్ రాజకీయ అడుగులు ఎలా ఉండబోతాయనే దానిపై ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆమె ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరపున కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆమె సొంత పార్టీని స్థాపిస్తారా? లేక మరో జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలో చేరుతారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరోవంక, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషిన్పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ చేపట్టింది. కేసీఆర్, హరీశ్‌రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లకు విచారణార్హత లేదని ఏజీ న్యాయస్థానానికి తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఏజీ వివరించారు. సీబీఐ విచారణకు ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధం లేదని అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపడుతుందని ఏజీ కోర్టుకు వివరించారు. వాదనలు విన్న హైకోర్టు విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు సిఫారసు, సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ సీబీఐతో జరిపించాలని లేఖలో పేర్కొంది. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు ఎన్‌డీఎస్‌ఏ గుర్తించిందని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ప్రణాళిక డిజైన్ నాణ్యత, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని తెలిపింది. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిటీ కూడా లోపాలను గుర్తించిందన్నారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై అసెంబ్లీలో చర్చించామని తెలిపారు.
అదేసమయంలో, కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు కోసం ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్రంలో సీబీఐకి ప్రవేశంపై ఉన్న అడ్డంకిని తొలగిస్తూ జీవో జారీ చేసింది. తెలంగాణలో సీబీఐకి ప్రవేశం నిషేధిస్తూ 2022లో గత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు హోంశాఖ జీవో ఇచ్చింది. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణకు సహకరిస్తామని జీవోలో వెల్లడించింది. ఎన్‌డీఎస్‌ఏ, పీసీ ఘోష్ నివేదికలను జీవోలో ప్రభుత్వం ప్రస్తావించింది. పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించామని జీవోలో పేర్కొంది. ప్రాజెక్టులో కేంద్ర సంస్థల ప్రమేయం దృష్ట్యా సీబీఐకి ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
More Stories
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు
సామాజిక పరివర్తనే లక్ష్యంగా సంఘ శతాబ్ది
పాక్‌లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన