కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలంటూ కేంద్ర హోంశాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ అధికారులు కేంద్రానికి లేఖ రాశారు. జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలని లేఖలో ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో సీబీఐ విచారణకు ఎలాంటి అడ్డంకులు లేవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకుంది.
అందుకు సంబంధించిన లేఖను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకి ప్రభుత్వం పంపినట్లు తెలిసింది. నీటిపారుదల శాఖ అధికారులు, మంత్రి అనుమతి తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం తీసుకొని రాష్ట్ర హోం శాఖ నుంచి కేంద్ర హోం శాఖకు లేఖను పంపినట్లు సమాచారం. శాసనసభ నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా లేఖను కేంద్ర హోం శాఖకు పంపి సీబీఐ విచారణ నిర్ణయాన్ని తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సీబీఐ విచారణకు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే కాళేశ్వరం బ్యారేజీలపై మళ్లీ దర్యాప్తు ప్రారంభంకానుంది. మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లులు అంతిమంగా ఎవరికి, ఎంత చేరిందన్న అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పైనా దర్యాప్తునకు సూచించింది. మేడిగడ్డ బ్యారేజి 7 బ్లాక్‌ను తిరిగి నిర్మించడం, బ్యారేజి మరమ్మతులకయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరించాలని కమిషన్ సూచించింది.
అన్నారం, సుందిళ్ల విషయంలోనూ నిర్మాణ సంస్థలకు ఇదే సిఫార్సు చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చర్య తీసుకొనే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని నివేదికలో కమిషన్ పేర్కొంది. మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ తీరుని కమిషన్ తప్పుపట్టింది. ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లపైనా చర్యలకు కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన ఇంజినీర్లలో మొదలైంది.
రాష్ట్రంలో విచారణ చేసేందుకు సీబీఐకి అడ్డంకు లేమీ లేవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కేసుల విచారణకు అనుమతివ్వాలని దస్త్రాలు వస్తే వెంటనే సంతకం చేసి ఆమోదం తెలిపానని తెలిపారు. ఇది నిరంతరం జరిగే సాధారణ ప్రక్రియ అన్న ఆయన ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని సీబీఐని కోరుతూ రాష్ట్ర శాసనసభ నిర్ణయించినందున అవరోధం ఏం ఉండదని పేర్కొన్నారు.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
తెలుగు రాష్ట్రాల స్వదేశీ జాగరణ్ మంచ్ సారధిగా రాచ శ్రీనివాస్
హైదరాబాద్ నుండి మరో రెండు వందే భారత్ రైళ్లు