
* కవిత ఆరోపణలతో బిఆర్ఎస్ లో ప్రకంపనలు
కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ రావులది కీలకపాత్ర అని, వీరిద్దరి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి వారిని కాపాడుతున్నారని ఆరోపిస్తూ ఎమ్యెల్సీ కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో చిన్న భాగం కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయినట్టు చేస్తున్నారని కవిత మండిపడ్డారు.
“హరీష్ నీవల్లే నాన్నపై సీబీఐ ఎంక్వైరీ. కడుపు రగిలిపోతోంది. తరతరాలకు తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్‌కు తిండిమీద డబ్బుమీద యావ ఉండదు. కేసీఆర్ పక్కన ఉన్నవాళ్లలో కొందరి వల్ల ఇలా జరిగింది. ఇదంతా హరీష్ రావు వల్లనే జరిగింది.” అంటూ కవిత కంటతడి పెట్టుకున్నారు. మాజీ సిఎం కెసిఆర్‌కు అవినీతి మరక ఎట్లా వచ్చిందో బిఆర్‌ఎస్ శ్రేణులు ఆలోచించాలని ఆమె కోరారు.
జస్టిస్ పిసి ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం కాళేశ్వరం అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆమె ఆరోపణలు కలకలం రేపాయి. దానితో ఆమెను బిఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయడం తధ్యం అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఆమె ఆరోపణలను కొట్టిపారవేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డైనమిక్ లీడర్ హరీష్‌రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అంటూ అసెంబ్లీలో అధికారపక్షాన్ని ఎదుర్కొన్నతీరును ప్రశంసించారు. నీటిపారుదల గురించి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ ప్రియశిష్యుడు హరీష్ ఇచ్చిన పాఠం ఇది అంటూ.. ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
ఈ వయసులో కెసిఆర్ సిబిఐ విచారణ ఎందుకు ఎదుర్కోవాలా? అని కవిత ప్రశ్నించారు. కెసిఆర్ రాజకీయాల్లో ఇన్నేళ్లు ఉన్నా ఆస్తులు సంపాదించుకోలేదని, డబ్బులపై కెసిఆర్‌కు ఏనాడు ఆశ లేదని ఆమె స్పష్టం చేశారు. హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పు డు జరిగిన అవినీతి కారణంగా ఆయనను రెండోసారి మంత్రి పదవి నుంచి తప్పించారని ఆమె గుర్తు చేశారు.
హరీష్ రావు, సంతోష్ రావు తన మీద కూడా చాలా కుట్రలు చేశారని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు. కాళేశ్వరంలో పనిచేసిన ముగ్గురు ఇంజినీర్ల వద్ద వందల కోట్ల సంపద ఉందని ఎంఎల్‌సి కవిత గుర్తు చేశారు. కాళేశ్వరం ఇంజినీర్ల ఆస్తులపై ఎందుకు విచారణ జరిపించట్లేదని, ఎసిబికి చిక్కిన ఇంజినీర్ల వెనుక ఎవరున్నారో ఎందుకు విచారణ చేయట్లేదని కవిత నిలదీశారు.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
తెలుగు రాష్ట్రాల స్వదేశీ జాగరణ్ మంచ్ సారధిగా రాచ శ్రీనివాస్
హైదరాబాద్ నుండి మరో రెండు వందే భారత్ రైళ్లు