5 గ్యారెంటీలతో దివాలా అంచుకు కర్ణాటక 

5 గ్యారెంటీలతో దివాలా అంచుకు కర్ణాటక 
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 5 గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్‌ సర్కారు ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఎడాపెడా అప్పులు చేస్తుండడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా అంచుకు చేరే ప్రమాదం దాపురించిందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తాజా నివేదిక హెచ్చరించింది.   ఐదు గ్యారెంటీల అమలు కోసమని 2023-24 ఆర్థిక సంవత్సరంలో విపణి నుంచి రూ. 63 వేల కోట్లను కర్ణాటక ప్రభుత్వం అప్పుగా తీసుకొన్నట్టు కాగ్‌ తెలిపింది. 
అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ. 37 వేల కోట్లు ఎక్కువని వెల్లడించింది.  అప్పుగా తీసుకొచ్చిన తాజా నిధుల్లో రూ. 16,964 కోట్లను గృహలక్ష్మి పథకానికి, రూ. 8,900 కోట్లను గృహజ్యోతికి, రూ. 7,384 కోట్లను అన్నభాగ్యకు, రూ. 3,200 కోట్లను శక్తికి, రూ. 88 కోట్లను యువనిధి స్కీమ్‌ కోసం కేటాయించినట్టు తెలిపింది. మొత్తం రెవెన్యూ వ్యయంలో ఐదు గ్యారెంటీలకు 15 శాతం నిధులు కేటాయిస్తున్నట్లు వివరించింది. 
 
అప్పులు పెరిగిపోవడం, రాబడి పడిపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతమాత్రం బాగోలేదని కాగ్‌ హెచ్చరించింది. 2022-23లో రూ. 46,623 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక లోటు 2023-24కు రూ. 65,522 కోట్లకు పెరిగినట్టు తెలిపింది. గ్యారెంటీలకే మెజార్టీ నిధులను కేటాయిస్తుండటంతో రాష్ట్రంలో మౌలిక వసతుల ప్రాజెక్టులు అటకెక్కినట్టు కాగ్‌ పేర్కొంది. 
ఏడాదిలోనే మూలధన వ్యయం రూ. 5,229 కోట్ల మేర తగ్గినట్టు గుర్తు చేసింది.
ప్రభుత్వ వ్యయ గణాంకాల్లో, గ్రాంట్ల విడుదలలో కూడా తప్పులు జరిగినట్టు తమ దృష్టికి వచ్చినట్టు వివరించింది. ఒకవైపు గ్యారెంటీల అమలుకు వేల కోట్ల రూపాయలను అప్పులుగా తెస్తున్నట్టు చెప్తున్న కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజంగా ఆ హామీలను అమలు చేస్తుందా? అంటే అదీలేదు.  మహిళలకు నెలకు రూ.2000 ఇచ్చే గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఆరేడు నెలలుగా ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
జనవరి 31 నాటికి గృహలక్ష్మి బకాయిలు రూ.7,517 కోట్లు ఉన్నట్టు ప్రభుత్వ ప్రణాళికా విభాగం విడుదల చేసిన తాజా నివేదికలో తేలింది. రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం అన్నభాగ్య పథకం కింద ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం ఇవ్వాలి. ఇందులో కేంద్రం 5 కిలోలు, రాష్ట్రం మరో 5 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. బియ్యం కొరత కారణంగా కిలోకు రూ.34 చొప్పున డబ్బులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, 7-8 నెలలుగా లబ్ధిదారులకు ఈ డబ్బులు ఇవ్వడం లేదని తెలుస్తున్నది.

గ్యారెంటీల పేరిట అప్పులుగా తెచ్చిన సొమ్మంతా ప్రభుత్వ పెద్దలు పక్కదారిపట్టిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఐదు గ్యారెంటీల అమలుకు కర్ణాటక ప్రభుత్వం ఏటా రూ.63 వేల కోట్ల వరకు నిధులు కేటాయించాల్సి వస్తున్నది. దీంతో కొత్తగా అప్పులు చేస్తున్నది.  ఈ క్రమంలో గ్యారెంటీల వ్యయాన్ని తగ్గించుకొనే ప్రణాళికలను రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఐదు గ్యారెంటీల లబ్ధిదారుల ఏరివేత చేపట్టాలని, కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఈ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలని సీఎం ఆదేశించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, ఐదు గ్యారెంటీల అమలు సర్కారుకు గుదిబండగా మారిందని సీఎం సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్‌ రాయరెడ్డి గతంలో హెచ్చరించారు. ‘ఇది ఖజానాపై పెను భారమే. అందుకే, దీనిపై ఏం చేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నాం. ఒకవైపు గ్యారెంటీలను అమలు చేస్తూనే, వ్యయాన్ని తగ్గించుకోవడానికి స్కీమ్‌ నిబంధనల్లో ఏమేం మార్పులు చేర్పులు తీసుకురావొచ్చో చర్చిస్తున్నాం’ అని రాయరెడ్డి పేర్కొన్నారు.