
అఫ్ఘానిస్థాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు సంభవించింది. గంటల వ్యవధిలో ఐదు సార్లు భూకంపం రావడంతో భారీగా ప్రాననష్టం సంభవించింది. ఆదివారం రాత్రి 11.47 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న కునార్ ప్రావిన్స్‌లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. నంగర్హర్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌కు 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని ఎన్‌సీఎస్ వెల్లడించింది.
దీంతో కునార్, లాఘ్‌మన్ ప్రావిన్సుల్లో భూప్రకంపణలు సంభవించాయి. చాలాచోట్ల భవనాలు కుప్పకూలిపోయాయి. దీంతో ఇప్పటివరకు సుమారు 800 మంది మరణించారని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. మరో 2500 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించింది. భూకంపం ప్రభావం కునార్ ప్రావిన్స్‌లో అత్యధికంగా ఉన్నది. మృతుల్లో 610 మంది ఈ ప్రావిన్స్‌కు చెందినవారే ఉన్నారు. నంగర్హర్ ప్రావిన్స్‌లో 12 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
కాగా, భూకంపం ధాటికి పలు గ్రామాల్లోని ఇండ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘఫ్పారీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విపత్తు ధాటికి కునార్, నోరిస్థాన్, నంగర్హార్ ప్రావిన్సులు తీవ్రంగా నష్టపోయాయన్నారు. ఇండ్లు కూలిపోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయని చెప్పారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాలపాలై ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బాధితుల పరిస్థితి దుర్భరంగా ఉందని, కునార్ ప్రజలకు సహాయం అవసరమని వెల్లడించారు.
ప్రతి ఐదు నిమిషాలకు ఒకరు చొప్పున బాధితులు దవాఖానలో చేరుతున్నారని డాక్టర్ ములాదాద్ తెలిపారు. ఆయన కునార్ ప్రావిన్స్ రాజధాని అసదాబాద్‌లో ఉన్న ప్రావిన్సియల్ దవాఖానలో సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు మహిళలు, చిన్నారులు సహా 188 మంది క్షతగాత్రులు దవాఖానలో చేరారరని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితిని గతంలో తామెప్పుడూ చూడలేదని, హాస్పిటల్‌లో అత్యవసర పరిస్థితి విధించామని తెలిపారు.
ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు తెలిపారు. కాగా, గతేడాది అక్టోబర్ 7వ తేదీన అఫ్గానిస్థాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ వెంటనే అనేకసార్లు భూప్రకంపనలు సంభవించాయి. దీంతో 4,000 మంది మరణించారని తాలిబన్ ప్రభుత్వం అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితి దాదాపు 1,500 మంది మరణాలు సంభవించాయని ప్రకటించింది. ఇటీవలి కాలంలో అఫ్గానిస్థాన్‌ను తాకిన అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యం ఇది.
More Stories
కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్ అరెస్ట్
ఆపరేషన్ సిందూర్ మళ్ళీ మొదలు కావచ్చు
భారత్ చేతిలో మరోసారి చిత్తుగా ఓడిన పాక్