బీసీ ఉద్యమకారుడు డా. వకుళాభరణం బీజేపీలో చేరిక

బీసీ ఉద్యమకారుడు డా. వకుళాభరణం బీజేపీలో చేరిక
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు బీసీ కమిషన్ సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్రంలో తొలి బీసీ కమిషన్ సభ్యుడిగా, అనంతరం బీసీ కమిషన్ చైర్మన్‌గా సేవలందించిన డా. వకుళాభరణం కృష్ణమోహన్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారి సమక్షంలో సోమవారం బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా రామ్‌చందర్ రావు కండువా కప్పి స్వాగతించి, ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య హాజరయ్యారు. ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామరావ్ పాటిల్ , డా. పాల్వాయి హరీష్ బాబు, సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.“బీసీలకు నిజమైన న్యాయం చేయగల పార్టీ బీజేపీ మాత్రమే. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను మతపరమైన ముస్లిం రిజర్వేషన్లుగా మార్చే రేవంత్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకునేది కూడా బీజేపీ మాత్రమే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అధికారికంగా జనగణనతో పాటు కులగణన చేపట్టబోతున్న ఏకైక పార్టీ బీజేపీ. నిజమైన సామాజిక న్యాయానికి పునాదులు వేస్తున్న బీజేపీలో చేరడం ప్రజలకు నిజాయితీతో సేవ చేసే అవకాశం వస్తుందనే నా విశ్వాసం” అని ఈ సందర్భంగా డా. వకుళాభరణం తెలిపారు.
బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో రేవంత్ ప్రభుత్వం తప్పులు చేస్తూ మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షం అయిన బీఆర్‌ఎస్ కూడా ఈ అంశంలో నిజమైన చిత్తశుద్ధి చూపలేదని తెలిపారు.“నా చేరిక పదవుల కోసం కాదు, సేవ కోసం. నా జీవితం అంతా బీసీల హక్కుల కోసం అంకితం” అని వకుళాభరణం తెలిపారు.
ముస్లింలకు మతం ఆధారంగా ఇచ్చిన 4% రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని అప్పుడే తాను గట్టిగా చెప్పినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బీసీల వాటాను కాపాడుకోవడం, కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంపు అవసరం అని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రారంభమైన ఈ పోరాటాన్ని ఇప్పుడు జాతీయ వేదికపై ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. డా. వకుళాభరణం బీసీల హక్కుల కోసం పోరాటం చేసిన విషయాలను రాజ్యసభ సభ్యుడు డా.కెలక్ష్మణ్ గుర్తు చేస్తూ బిజెపి ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని యావత్ బీసీ సమాజం అంతా నపేర్కొరేంద్ర మోదీ నాయకత్వం పట్ల నమ్మకం, విశ్వాసంతో ఉందని లక్ష్మణ్ అన్నారు.
మేధావులు, సామాజిక వర్గాలు బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై వరుసగా పార్టీలో చేరుతున్నారని, ముఖ్యంగా కృష్ణమోహన్ గారు చేరిక పార్టీకి శక్తివంతమైన అస్త్రం అని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు.