పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన ఎస్సీఓ సభ్యదేశాలు

పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన ఎస్సీఓ సభ్యదేశాలు
చైనాలో జరుగుతున్న 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి సభ్య దేశాలు. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ విధానాలు పాటించడం సరికాదని తెలిపాయి. ఈ మేరకు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. ఉగ్రవాదాన్ని అణచివేస్తామని ప్రతినబూనిన సభ్య దేశాలు, గాజాలో ఇజ్రాయెల్ చేపడతున్న సైనిక చర్యను ఖండించాయి. 

ఐరాస గ్లోబల్ కౌంటర్-టెర్రరిజం స్ట్రాటజీని పూర్తిగా అమలు చేయడంలో ఐక్యరాజ్యసమితి ముఖ్య పాత్ర పోషిస్తుందని ఎస్​సీఓ పేర్కొంది. ఉగ్రవాద గ్రూపులను సంయుక్తంగా ఎదుర్కోవడానికి ఐరాస చార్టర్, అంతర్జాతీయ చట్ట సూత్రాలకు అనుగుణంగా సంబంధిత ఐరాసభద్రతా మండలి తీర్మానాన్ని అమలు చేయాలని తెలిపింది.  ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ప్రధాన సవాల్‌గా మారిందని ఎస్​సీఓ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదం, వేర్పాటువేదాన్ని ఉపయోగించుకోవటం ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పాయి. ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని అణచివేసేందుకు సభ్య దేశాలు చేస్తున్న ప్రయత్నాలను గుర్తిస్తున్నామని వెల్లడించాయి.

“2025 ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఎస్​సీఓలోని సభ్యదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ ఉగ్రదాడిలో మరణించిన, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించాయి. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను, అందుకు సహకరించిన వారిని చట్టం ముందుకు తీసుకవచ్చి శిక్షించాలి. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి మద్దతు ఇస్తాం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని అడ్డుకుంటాం. ఉగ్రవాదంపై ద్వంద్వ విధానాలు అనుసరించడం అమోదనీయం కాదు” అని ఎస్​సీఓ డిక్లరేషన్​లో పేర్కొంది.

కాగా, అంతకుముందు ఈ ఏడాది చైనాలో జూన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల రక్షణ మంత్రుల సదస్సులో ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేందుకు భారత్ నిరాకరించింది. పాక్‌ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం, పహల్గాం ముష్కర దాడులను ప్రస్తావించకపోవడంపై తీవ్రంగా పరిగణించింది. దీంతో భారత్​ తరఫున హాజరైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించారు. ఫలితంగా ఎలాంటి ఉమ్మడి ప్రకటన లేకుండానే నాటి చర్చలు ముగిశాయి.