కాళేశ్వరం ప్రాజెక్టులో కాంగ్రెస్- బిఆర్‌ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్

కాళేశ్వరం ప్రాజెక్టులో కాంగ్రెస్- బిఆర్‌ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడు బ్యారేజీలపైనే విచారణ జరిపించడాన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్- బిఆర్‌ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందన్న అనుమానం కలుగుతున్నదని బిజెపి శాసనసభా పక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.  అవినీతి చేసిన వారిని జైలుకు పంపించకుండా కంటి తుడుపు చర్యగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారని ఆయన విమర్శించారు. 

ఆదివారం అసెంబ్లీ సమావేశంలో పిసి ఘోష్ కమిషన్ నివేదికపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దోషులను శిక్షించాలన్న ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కమిషన్ల కోసం ప్రాజెక్టు కట్టారని ఆరోపించిన వారు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై కేసులు పెట్టబోమని అంటున్నారని ఆయన కాంగ్రెస్‌నుద్దేశించి విమర్శించారు. 

కమిషన్ నివేదికలో కెసిఆర్ పేరు ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. అవినీతి చేసిన వారిపై ఏమి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లక్ష కోట్ల దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకునే వరకు ప్రజలు ఊరుకోరని ఆయన హెచ్చరించారు.  సిబిఐ లేదా సిట్ విచారణ జరిపిస్తారా? చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కమిషన్ ఎందుకు వేశారో, అసెంబ్లీ సమావేశాలను హడావుడిగా ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదని మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.

మజ్లీస్ శాసనసభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగిస్తూ  వేల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చివేస్తరా? నిలిపివేస్తరా? కొనసాగిస్తరా? అనేది ప్రభుత్వం స్పష్టంచేయాలనిడిమాండ్ చేశారు. రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజ్టెక్టుకు మరమ్మతు చేయాలని సూచించారు. జస్టిస్‌ ఘోష్‌ రిపోర్టులో కాంట్రాక్టర్ల పేర్లు ఎందుకు లేవని, వారికి డ్యామ్‌ డ్యామేజీలో బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. 

సీఎస్‌ వంటి ప్రధాన అధికారులను ఎందుకు వదిలేశారని, నేరస్థుడు అప్రూవర్‌గా మారితే మంచివాడా? అని ప్రశ్నించారు. కమిషన్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ.. ఘోష్‌ కమిషన్‌ రిపోర్టు సభలో పెట్టకముందే, క్యాబినెట్‌లో పెట్టకముందే మీడియాకు ఎలా లీక్‌ అయ్యిందని ప్రశ్నించారు. రూ.6.78 కోట్లు రికవరీ చేయాలని కమిషన్‌ రిపోర్టులో ఉన్నదని పేర్కొంటూ.. మరి ఏర్పాటుకు ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు.