ఉగ్రవాదానికి క్రిప్టో కరెన్సీ ఉపయోగిస్తున్న పాకిస్తాన్

ఉగ్రవాదానికి క్రిప్టో కరెన్సీ ఉపయోగిస్తున్న పాకిస్తాన్
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదానికి పాకిస్థాన్ సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. హవాలా, నకిలీ కరెన్సీ, మాదక ద్రవ్యాలు వంటి పాత పద్ధతులపై ఆధారపడిన పాక్, ఇప్పుడు క్రిప్టోకరెన్సీ ద్వారా నిధులు పంపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. గత నెలలో జమ్ముకశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ) కీలక సోదాలు నిర్వహించింది.  ఉగ్రవాదానికి నిధులు సమకూర్చేందుకు క్రిప్టోకరెన్సీ వ్యాపారంలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న వారి నివాస స్థలాలపై కాశ్మీర్, జమ్మూ విభాగాలలోని ఏడు నివాస స్థలాలపై ఎస్ఐఏ ఇటీవల దాడులు నిర్వహించింది.

వేర్పాటువాద ఉద్యమానికి ఆజ్యం పోసేందుకు ఐఎస్ఐ, ఇతర సంస్థల ప్రమేయం గురించి విశ్వసనీయ సమాచారాన్ని ఏజెన్సీ కనుగొన్నట్లు వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం అయ్యాయి. దర్యాప్తులో కశ్మీర్ ఉగ్రవాదులకు సరిహద్దుల నుంచి క్రిప్టోకరెన్సీ రూపంలో డబ్బు చేరుతోందని ఆధారాలు లభించాయి. దేశ సమగ్రతను కాపాడటంలో తమ కట్టుబాటు ఇదే నిదర్శనమని ఎస్ఐఏ ప్రకటించింది.

అక్రమ వాణిజ్య సూత్రధారి పాకిస్తాన్‌లో ఉన్నాడని, పొరుగు దేశానికి చెందిన ఉగ్రవాద సంస్థలు, “అధికారిక ఏజెన్సీలు” అతనికి మద్దతు ఇస్తున్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని రాష్ట్ర దర్యాప్తు సంస్థ ప్రతినిధి తెలిపారు. జమ్మూ, కాశ్మీర్‌లోని ఏజెంట్లకు క్రిప్టోకరెన్సీని పంపుతున్నారని, వారు సామూహిక హింస, ఉగ్రవాదాన్ని పెంచడం కోసం ఉగ్రవాద గ్రూపులు, వేర్పాటువాదుల మధ్య దానిని మరింత పంపిణీ చేస్తున్నారని చెప్పారు.

“పాకిస్తాన్ సూత్రధారిని గుర్తించారు. అయితే, అతని వివరాలను గోప్యంగా ఉంచుతున్నామని” ప్రతినిధి చెప్పారు.  ఇప్పటివరకు హవాలా వంటి పద్ధతుల్లో నిధులు పంపినప్పుడు, ఎక్కడో ఒక దశలో మనీ ట్రయిల్ దొరికేది. ఆ ఆధారాలతో పాకిస్థాన్ ఉగ్ర నిధుల సంబంధం భారత ఏజెన్సీలు నిరూపించగలిగాయి. వేర్పాటువాదుల వెన్ను విరవడంలో ఈ ప్రయత్నాలు కీలకం అయ్యాయి. 

అయితే క్రిప్టో లావాదేవీలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతాయి. పంపినవారు, స్వీకరించినవారి వివరాలు బయటకు రావు. దీంతో దర్యాప్తు సంస్థలకు మూలాలు కనిపెట్టడం కష్టమవుతోంది. ఈ ఏడాది మార్చి 2025లో పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా “పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్”ను ప్రారంభించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకే ఈ చర్య అని ప్రకటించింది. కానీ దీని వెనుక ఉగ్ర నిధుల దారులు విస్తరిస్తున్నాయని భారత ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. 

అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి సంబంధాలున్న “వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్” అనే సంస్థతో పాకిస్థాన్ ఒప్పందం కుదుర్చుకుంది. బహిరంగంగా పెట్టుబడుల పేరుతో చెప్పినా, అసలు లక్ష్యం ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ఇప్పటికే హెచ్చరించింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, వర్చువల్ ఆస్తులు, సోషల్ మీడియా వేదికలు ఉగ్రవాద నిధుల కోసం దుర్వినియోగం అవుతున్నాయని తన నివేదికలో పేర్కొంది.2019లో హమాస్ ఉగ్ర సంస్థ తొలిసారి క్రిప్టో ద్వారా విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. 

అప్పటి నుంచి ఈ ధోరణి మరింత విస్తరించింది.భారత దర్యాప్తు సంస్థలు కూడా ఇటీవలి దాడుల్లో ఆధారాలు కనుగొన్నాయి. రామేశ్వరం కేఫ్ పేలుడు (2024), పుల్వామా దాడి (2019) వంటి కేసులలో ఉగ్రవాదులు క్రిప్టో వ్యాలెట్లు, డార్క్‌నెట్, చైనీస్ యాప్‌లు వాడినట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. క్రిప్టోకరెన్సీ గుట్టుచప్పుడు కాకుండా లావాదేవీలకు మార్గం కావడంతో, ఉగ్రవాదులు దీనిని ప్రధాన సాధనంగా మలుచుకుంటున్నారు. దర్యాప్తు సంస్థలకు ఇది పెనుసవాలుగా మారింది.

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టే పోరాటంలో కొత్త సవాలు స్పష్టమవుతోంది. పాకిస్తాన్ క్రిప్టో మార్గాన్ని వాడుతూ నిధులు పంపడం, భారత భద్రతా వ్యవస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ సహకారం, కఠినమైన పర్యవేక్షణ తప్పనిసరి.