రూ.1.66 లక్షల పెట్టుబడులకు ఇండియన్ ఆయిల్

రూ.1.66 లక్షల పెట్టుబడులకు ఇండియన్ ఆయిల్
 
దేశంలోనే అతిపెద్ద చమురు కంపెనీల్లో ఒక్కటైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఒసి) భారీ పెట్టుబడులకు సిద్దమయ్యింది. వచ్చే ఐదేళ్లలో రూ.1.66 లక్షల పెట్టుబడి వ్యయాలను చేయనున్నామని ఆ కంపెనీ ఛైర్మన్‌ అరవిందర్‌ సింగ్‌ సాహ్నీ వెల్లడించారు. ఈ పెట్టుబడులను చమురు శుద్ది, ఇంధన విక్రయం, రసాయన ఉత్పత్తులు, సహజ వాయువు, పునర్వినియోగ శక్తి రంగాలలో విస్తరణకు ఉపయోగించనున్నామని తెలిపారు. 
 
తమ ప్రస్తుత 80.75 మిలియన్‌ టన్నుల ఆయిల్‌ శుద్దీకరణను 2028 నాటికి 98.4 మిలియన్‌ టన్నులకు పెంచాలని యోచించామని తెలిపారు. పానిపట్‌, గుజరాత్‌, బరౌనీలలో ప్రధాన విస్తరణలు జరుగుతాయని చెప్పారు. దేశంలోని 22,000 కిలోమీటర్ల పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ను 21 ప్రాజెక్టులతో విస్తరిస్తోందని వివరించారు. ఇందులో నేపాల్‌లో కొత్త స్టోరేజీ సౌకర్యాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. 
 
రసాయన ఉత్పత్తులను తదుపరి వృద్ధి ఇంజిన్‌గా లక్ష్యంగా చేసుకుని, ప్రస్తుత 4.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యాన్ని 2030 నాటికి 13 మిలియన్‌ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, లాభాలను పెంచేందుకు ప్రత్యేక రసాయనాలపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు.  ప్రస్తుతం ఇండియన్‌ ఆయిల్‌ 40,000 కంటే ఎక్కువ రిటైల్‌ ఇంధన విక్రయ కేంద్రాల నెట్‌వర్క్‌ను కలిగి ఉందని పేర్కొన్నారు. 
 
వీటికి విద్యుత్‌ వాహన ఛార్జర్లు, బ్యాటరీ మార్పిడి కేంద్రాలు, సిఎన్‌జి. ఎల్‌ఎన్‌జీ పంపిణీ కేంద్రాలను జోడించనున్నామని తెలిపారు. రూ.2.5 లక్షల కోట్లతో హరిత హైడ్రోజన్‌ ఉత్పత్తి, స్థిరమైన విమాన ఇంధనం, 1జిగావాట్‌ నుండి 18 జిగావాట్లకు పునర్వినియోగ విద్యుత్‌ సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా 2046 నాటికి శూన్య ఉద్గారాలను సాధించాలని నిర్దేశించుకున్నామని వివరించారు. 
 
న్యాచురల్‌ గ్యాస్‌ వ్యాపారం 20 శాతం వృద్ధితో 7.9 మిలియన్‌ టన్నులకు చేరిందన్నారు. 2024-25లో 100 మిలియన్‌ టన్నుల విక్రయాలు, 20,000 కిలోమీటర్ల పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌, 40,000 ఇంధన కేంద్రాలు ప్రతీ రోజు 3.2 కోట్ల వినియోగదారులకు సేవలందిస్తున్నాయని చెబుతూ అదే విధంగా 15 కోట్ల మంది ఎల్‌పిజి గ్యాస్‌ వినియోగదారులను కలిగి ఉన్నామని పేర్కొన్నారు. తమ పెట్టుబడులు దీర్ఘకాలిక విలువను సృష్టిస్తాయని సాహ్నీ తెలిపారు.