గణేష్ విగ్రహ ఊరేగింపుల్లో ఆరుగురు మృతి

గణేష్ విగ్రహ ఊరేగింపుల్లో ఆరుగురు మృతి
వినాయక విగ్రహ ఊరేగింపుల్లో అపశృతులు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో ఆంధ్ర ప్రదేశ్ లో ఆరుగురు మృతి చెందారు. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలోని ఈవనవారి మెరక ఏరియాలో ఆదివారం వినాయక విగ్రహం నిమజ్ఞనంలో భాగంగా ట్రాక్టర్‌పై విగ్రహాన్ని ఎక్కించి గ్రామంలో ఊరేగింపు కోసం సిద్ధం చేశారు. 
 
ట్రాక్టర్‌ ఎదురుగా సుమారు 20 మంది యువకులు, బాలురు డ్యాన్స్‌ చేస్తున్నారు. ట్రాక్టర్‌ అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటనలో తిరుమల నరసింహమూర్తి (35), గురుజు మురళి (38), కడియం దినేష్‌ (9), ఈవన సూర్యనారాయణ (58) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 
కలెక్టర్‌ నాగరాణి నరసాపురం ప్రభుత్వాస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అల్లూరి జిల్లా పాడేరు మండలం చింతలవీధి జాతీయ రహదారిలో వినాయక నిమజ్జన ర్యాలీగా తీసుకెళ్తున్నారు. ఈ సమయంలో వస్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి ఈ ర్యాలీపైకి తీసుకెళ్లింది. దీంతో, ర్యాలీలో ఉన్న ఆర్‌టిసి రిటైర్డ్‌ డ్రైవర్‌ సీతారాం, జి.కొండబాబు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. వారిలో కె.విశ్వ, వి.దాలమ్మ పరిస్థితి విషమంగా ఉంది. వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
 
రాష్ట్రంలో పలుచోట్ల గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాల్లో జరిగిన ప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సంతోషంగా వేడుక జరుపుకుంటున్న వారు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంపై సిఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. నిర్లక్ష్యంతో ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలకు సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కాగా, ఈ ఘటనలపై వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.