
ఒక వంక ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో భారత్ – చైనాల మధ్య సంబంధాలు పుంజుకొని అవకాశాలు కనిపిస్తుండగా, మరోవంక అక్టోబర్ నుంచి స్పెషాలిటీ ఎరువుల ఎగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించాలని చైనా నిర్ణయించింది. ఫలితంగా భారత్లోనూ ఎరువుల ధరలు పెరగనున్నాయని, సరఫరా సమస్యలు తలెత్తుతాయని సాల్యూబుల్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ వెల్లడించింది.
తనిఖీలు, సరకు రవాణా ఆలస్యం రూపంలో చైనా ఆంక్షలు ఉంటాయని ఎస్ఎఫ్ఐఏ అధ్యక్షుడు రాజీవ్ చక్రవర్తి తెలిపారు. 80 శాతం స్పెషాలిటీ ఎరువులను ప్రత్యక్షంగా మరో 15 శాతాన్ని పరోక్షంగా చైనా నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఐదు శాతం ఎన్ పీకే ఫార్ములేషన్లు మినహా, మిగిలిన 95 శాతం స్పెషాలిటీ ఎరువుల కోసం చైనాపైనే భారత్ ఆధారపడుతుంది.
ఇటీవల వాటి ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించడంతో వాటి ధరలు 40శాతం పెరిగాయి. సరఫరా కొరత ఏర్పడింది. ఆ తర్వాత ఒక నెల ఆంక్షలకు విరామం ప్రకటించడంతో భారత కంపెనీలు సీజన్ అవసరాల కోసం వాటిని సేకరించాయి. సెప్టెంబర్లో ప్రారంభమయ్యే వాణిజ్య పంటలు, ద్రాక్ష, అరటి వంటి ఉద్యాన పంటల్లో బిందు సేద్యం కోసం రైతులు వీటిని ఉపయోగిస్తారు. స్వదేశీ సరఫరా మధ్య సీజన్లో అందుబాటులోకి రానుందని, అయినా ధరల పెరుగుదల తప్పదని తెలుస్తోంది.
ముఖ్యంగా మొక్కలు, చెట్లకు భూవాతావరణ పరిస్థితుల ఆధారంగా కొన్నిరకాల పోషకాలను అందించి ఫలసాయం సాధించేందుకు తయారుచేసిన వాటిని ప్రత్యేకమైన ఎరువులు అని పిలుస్తుంటారు. వీటిల్లో పలు రకాలు ఉండగా, వీటిని పెద్దఎత్తున తయారుచేసుకొనే సామర్థ్యం భారత్కు లేదు. చిన్న మొత్తాల్లో స్థానికంగా తయారుచేస్తుంటారు. వాస్తవానికి ఈ రకం ఎరువులను ఎగుమతి చేయాలంటే ఆ ఫ్యాక్టరీ షిప్మెంట్లను చైనా అధికారులు తనిఖీలు చేయాలి.
ఈ క్రమంలోనే భారత్కు పంపే షిప్మెంట్స్ను వారు తనిఖీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, స్పష్టమైన నిషేధం ఏదీ విధించకుండానే ఎగుమతులను అడ్డుకొనేందుకు చైనా ఈ ఎత్తుగడ వేసినట్లు సమాచారం. భారత్ జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో 1,50,000-1,60,000 టన్నుల ప్రత్యేక ఎరువులను దిగుమతి చేసుకొంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇవి భూసారాన్ని కాపాడుతూనే ఫలసాయాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. ఈ రంగంలో నాగార్జున ఫర్టిలైజర్స్, దీపక్ ఫర్టిలైజర్స్, ప్రదీప్ ఫర్టిలైజర్స్ కంపెనీలు అధికంగా వ్యాపారం చేస్తున్నాయి.
More Stories
ప్రకృతితో సమతుల్యతతో జీవించడమే ఆయుర్వేదం
ఆసియాకప్లో హద్దుమీరిన పాక్ ఆటగాళ్లు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవంకు ముఖ్యఅతిధిగా మాజీ రాష్ట్రపతి