సెప్టెంబర్లోనూ భారీగా వర్షాలు, ఆకస్మిక వరదల ముప్పు

సెప్టెంబర్లోనూ భారీగా వర్షాలు, ఆకస్మిక వరదల ముప్పు
 
* వాయువ్య భారత్ లో ఆగస్టులో 265 మి.మీ వర్షపాతం
 
దేశంలో సెప్టెంబరు నెలలోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షాలే కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. సాధారణంగా ఏటా సెప్టెంబరులో 167.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంటుంది. అయితే ఈసారి అదే నెలలో సాధారణం కంటే 109 శాతం ఎక్కువ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.  అయితే ఈశాన్య భారత్, తూర్పు భారత్, దక్షిణ భారత్, వాయవ్య భారత్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలే పడొచ్చని తెలిపింది. 
 
దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణ స్థాయిలో, సాధారణాన్ని మించిన స్థాయిలో వానలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. భారత్‌లో 1980 సంవత్సరం నుంచి ఏటా సెప్టెంబరులో కురిసే వర్షపాతం క్రమంగా పెరుగుతోందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా తెలిపారు. అయితే 1986, 1991, 2001, 2004, 2010, 2015, 2019 సంవత్సరాల సెప్టెంబరు నెలల్లో తక్కువ వర్షపాతం నమోదైందని చెప్పారు.

కాగా, ఆగస్టు నెలలో భారతదేశంలో మొత్తం 268.1 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని ఐఎండీ తెలిపింది. ఇది సాధారణం కంటే 5 శాతం ఎక్కువ. గత 3 నెలల్లో (జూన్ – ఆగస్టు) మన దేశంలో అత్యధికంగా 743.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వ్యవధిలో సాధారణం కంటే 6 శాతం ఎక్కువ వానలు పడ్డాయి.  అయితే, వాయువ్య భారతదేశంలో ఆగస్టులో 265 మి.మీ వర్షపాతం నమోదైంది. 2001 తర్వాత ఈ నెలలో ఇదే అత్యధికమని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది.

1901 తర్వాత 13వ అత్యధిక వర్షపాతమని పేర్కొంది. వర్షాకాలంలో మూడు నెలల్లో ఇప్పటివరకు ఈ ప్రాంతంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని తెలిపింది. పంజాబ్‌ను దశాబ్దకాలంగా ఎప్పుడు లేనంతగా వరదలు ముంచెత్తాయి. నదులు, కాలువలు గట్లు తెగకపోవడంతో పాటు వేల హెక్టార్ల వ్యవసాయ భూమి నీట మునిగింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌; ఉత్తరాఖండ్‌, జమ్ములలో క్లౌడ్‌బరెస్ట్‌లు సంభవించాయి.

దక్షిణ భారతదేశంలో ఆగస్టులో 250.6 మి.మీ వర్షపాతం నమోదవగా, సాధారణం కంటే 31శాతం అధికం. ఇది 2001 తర్వాత మూడవ అత్యధిక వర్షపాతం, 1901 తర్వాత ఎనిమిదవ అత్యధిక వర్షపాతం అని ఐఎండి తెలిపింది. జూన్‌ 1 నుండి ఆగస్ట్‌ 31 మధ్య ఈ ప్రాంతంలో మొత్తంగా 607.7 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం 556.2మి.మీ కన్నా 9.3 శాతం లోటుగా పేర్కొంది.

ఆగస్టులో దేశవ్యాప్తంగా 268.1మి.మీ వర్షపాతం నమోదు కాగా, ఇది సాధారణం కన్నా సుమారు 5శాతం అధికమని ఐఎండి వెల్లడించింది. జూన్‌ నుండి ఆగస్ట్‌ వరకు మూడు నెలల్లో 743.1మి.మీ వర్షపాతం నమోదు కాగా, సాదారణం కన్నా సుమారు 6 శాతం అధికమని పేర్కొంది.