విదేశీ దేవాలయాలతో ఏపీ దేవాలయాల అనుసంధానం!

విదేశీ దేవాలయాలతో ఏపీ దేవాలయాల అనుసంధానం!
 
* హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ నూతన చైర్మన్ డా. దాసరి ప్రణాళికలు 
 
అరబ్ దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా హిందువులు భారీ దేవాలయాలను నిర్మిస్తూ, సంప్రదాయపరంగా వాటిని నిర్వహిస్తూ, హిందూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు. సంపన్న దేశమైన అమెరికాలో అటువంటి దేవాలయాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వాల ప్రోత్సాహం, వనరులతో ప్రమేయం లేకుండా దాతృత్వంలో కొద్దిమంది వ్యక్తుల చొరవతో నిర్మిస్తున్నవే. 
 
అయితే వారందరి మనస్సులో భారత్ లో చిరకాలంగా పూజలు అందుకుంటున్న దేవాలయాలపైనే ఉంటుంది. స్వదేశంకు వచ్చిన్నప్పుడు ఆయా దేవాలయాలను సందర్శించుకొనేందుకు ఆసక్తి చూపుతూ వస్తున్నారు.  ఆంధ్ర ప్రదేశ్ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ గా వినాయక చవితి మరుసటి రోజు విజయవాడలో బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డా. దాసరి శ్రీనివాసులు ఏపీలోని దేవాలయాల అభివృద్ధి కోసం ప్రవాస ఆంధ్రుల సహకారం పొందేందుకు బృహత్తర ప్రణాలికను రూపొందించాలనే ఆసక్తి కనపరుస్తున్నారు.
 
ఏపీలోని అన్ని ప్రముఖ దేవాలయాలను అమెరికా వంటి దేశాలలోని దేవాలయాలు, వాటి నిర్వాహకులతో అనుసంధానించి, ఆయా దేవాలయాల సందర్శనకు ఇక్కడకు వచ్చిన వారికి ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేస్తి, ఆయా దేవాలయాల అభివృద్ధిలో వారి భాగస్వామ్యం పొందేవిధంగా చూడాలని భావిస్తున్నారు.  పదవీబాధ్యతలు చేపట్టిన మరుసటి రోజునే స్వదేశంకు వచ్చి, తిరిగి వెడుతున్న  అమెరికాలోని మిచిగాన్‌లో పరాశక్తి ఆలయాన్ని నిర్మించిన 85 ఏళ్ల దిగ్గజం డాక్టర్ కృష్ణ జి. కుమార్ ను కలిసి ఈ ప్రతిపాదనపై చర్చించారు.
డా. కుమార్ నిర్మించిన పరాశక్తి దేవాలయంకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో దేవతా విగ్రహాన్ని బహుకరించారు.  ఆయన నుండి సానుకూల స్పందన రావడంతో ఈ విషయమై ముందడుగు వేసేందుకు సమాయత్తం అవుతున్నారు.  విజయవాడలోని కనకదుర్గ దేవాలయం ను మిచిగాన్ ఆలయంతో అనుసంధానం చేసే విషయమై  డాక్టర్ కుమార్ సానుకూలత వ్యక్తం చేశారు. 
ప్రవాస భారతీయులకు తమ స్వస్థలలోని దేవాలయాలతో కేవలం ఆధ్యాతికంగానే కాకుండా భావాత్మక అనుబంధం కూడా ఉందని మరచిపోరాదు. ఆ విధంగా అనుసంధానం కావించడం ఓ విధంగా సాంస్కృతిక ఇంజనీరింగ్ చర్య కాగలదు. తిరుమల తిరుపతి దేవస్థానం 2024లో విదేశీ యాత్రికుల భాగస్వామ్యంలో 10 శాతం అభివృద్ధిని చూసింది.  ఈ ధోరణి కొనసాగితే, విజయవాడ, తిరుపతి, మిచిగాన్, బహుశా లండన్ లలోని దేవాలయాలు సమన్వయంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకొనే అవకాశం ఉంటుంది. 
ప్రవాస ఆంధుల భాగస్వామ్యంతో ఏపీలోని దేవాలయాల అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ గా పనిచేస్తున్నప్పుడే డా. దాసరి శ్రీనివాసులు ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో ఆయా దేవాలయాల పాలకవర్గాలు, ప్రభుత్వంలోని పెద్దలు సహితం అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఫలించలేదు.  ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస ఆంధ్రుల భాగస్వామ్యం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న సమయంలో డా. శ్రీనివాసులు ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది.
అలనాటి హిందూ సాంస్కృతిక వైభవం, ధర్మనిరతి, సాంప్రదాయాలు విశ్వవ్యాప్తి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన భావిస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ నూతన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే  హిందూ ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.  హైందవ సాంప్రదాయాలు సంస్కృతికి మరింత పేరు తెచ్చే విధంగా పనిచేస్తానని తెలిపారు. 
 
గతంలో సామాజిక సమరసత ఫౌండేషన్ అధ్యక్షుడుగా రాష్ట్రంలోని దేవాలయాలు లేని ఎస్సి, ఎస్టీ కాలనీలలో, మత్స్యకారుల కాలనీలలో స్థానికులతో కలిసి 500కు పైగా దేవాలయాలను నిర్మించారు. అందుకు అవసరమైన ఆర్ధిక వనరులను టిటిడి సమకూర్చింది. ఆయన కాలనీలోని స్థానికులు కోరుకున్న దేవాలయాలను నిర్మించి, వాటి నిర్వహణ బాధ్యతలను సహితం వారికే ఉమ్మడిగా అప్పచెప్పారు.
 
 వారి కుటుంబ సభ్యులలో ఆసక్తి కలిగిన వారుంటే వారికి తగు శిక్షణ ఇప్పించి, వారినే అర్చకులుగా ఆయా దేవాలయాలలో నియమించారు. ఆ విధంగా సామాజిక భాగస్వామ్యంతో దేవాలయాల నిర్మాణం, నిర్వహణ జరిగే విధంగా చూడటం ద్వారా రాష్ట్రంలో ఓ విధమైన సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టారు.