తెలంగాణలో రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేత

తెలంగాణలో రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేత

* గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండ‌రాం, అజారుద్దీన్!

 
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వ పరంగానే ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. శాసనసభ ఆమోదించిన రెండు బీసీ రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండడం, గవర్నర్‌కు పంపిన రెండు ఆర్డినెన్స్‌లు కూడా రాష్ట్రపతి వద్దకే వెళ్లిన నేపథ్యంలో ఇప్పుడా ఆర్డినెన్స్‌ల స్థానంలో రెండు బిల్లులను తిరిగి ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టి వెంటనే ఆమోదించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 
ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితిని సడలించే దిశగా రిజర్వేషన్ల విషయంలో పరిమితిని ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ చర్చల అనంతరం బిసి వర్గాలకు 42 శాతం రేజర్వేషన్లు కల్పించే విధంగా ప్రత్యేక జీవో జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా బీసీ వర్గాల వారికి విద్య, ఉద్యోగ అవకాశాలు విస్తరించనున్నాయి.  దీనికి ప్రభుత్వం ముందుగా పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285(ఏ)లో సవరణలు చేయాలని నిర్ణయించింది.
ఈ మార్పుతో పంచాయతీ ఎన్నికలలో బీసీ వర్గాల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుంది. స్థానిక సంస్థలలో బీసీలకు ఎక్కువ స్థానాలు లభించడం ద్వారా సామాజిక సమానత్వం బలోపేతం అవుతుంది.  తర్వాత ప్రభుత్వం 50 శాతం సీలింగ్ తొలగింపుపై చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టే యత్నం చేయనుంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న క్యాప్‌ను తొలగిస్తూ పంచాయతీరాజ్‌ చట్టం-2018, పురపాలక చట్టం-2019 సవరణల బిల్లులను ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతారు. దాంతోపాటు బీసీలకు 42 రిజర్వేషన్లను వర్తింపజేస్తూ ప్రత్యేక జీఓను జారీ చేస్తారు.
ఆర్డినెన్స్ రూపంలో తీసుకెళ్లిన 42 శాతం బిసి రేజర్వేషన్ల ప్రతిపాదనకు ఆమోదం లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా ఈ మార్పులను అమలు చేయాలని తుది నిర్ణయం తీసుకుంది. దీని కోసం అవసరమైన ఫైల్స్ సిద్ధం చేసి అమలు ప్రక్రియను వేగవంతం చేస్తోంది. జీవో అమల్లోకి రాగానే బీసీ వర్గాలకు విద్యాసంస్థలు, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక ప్రాధాన్యత లభిస్తుంది.
 
కాగా, గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండ‌రాం, అజారుద్దీన్ పేర్ల‌ను నిర్ణ‌యించింది. వీరిద్ద‌రి పేర్ల‌ను గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్ర‌తిపాదిస్తూ సంబంధిత ఫైలును గ‌వ‌ర్న‌ర్‌కు ప్ర‌భుత్వం పంపింది. అయితే అజారుద్దీన్ పేరును ప్ర‌భుత్వం అనూహ్యంగా తెర‌పైకి తీసుకొచ్చింది. గ‌తంలో సిఫార‌సు చేసిన అమేర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్‌కు చోటు ల‌భించింది. 
 
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో పోటీ చేసేందుకు అజారుద్దీన్ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న క్ర‌మంలో.. ఆయ‌నను ఎమ్మెల్సీగా ఎంపిక చేయ‌డంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. కాంగ్రెస్ త‌ర‌పున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో ఎవ‌ర్నీ నిల‌బెడుతార‌నే అంశంపై జోరుగా చ‌ర్చ కొన‌సాగుతోంది.