దారుణ హత్యకు గురైన ఉక్రెయిన్ మాజీ స్పీకర్‌!

దారుణ హత్యకు గురైన ఉక్రెయిన్ మాజీ స్పీకర్‌!

ఉక్రెయిన్‌ పార్లమెంట్ మాజీ స్పీకర్ ఆండ్రియి పరుబియ్ దారుణ హత్యకు గురయ్యారు. లీవ్‌ నగరంలో శనివారం మధ్యాహ్నం దుండగులు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు. మాజీ స్పీకర్ హత్యను ఖండించిన అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పరుబియ్‌ని అత్యంత కిరాతకంగా చంపేశారని, దర్యాప్తు వేగవంతం చేసి హంతకులను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జెలెన్‌స్కీ తెలిపారు.

కీవ్ ఇండిపెండెంట్ అనే ఆన్‌లైన్ వార్తాపత్రిక కథనం ప్రకారం లీవ్‌లోని ఫ్రాంకివ్‌స్కీ జిల్లాలో పరుబియ్‌పై కాల్పలు జరిగాయి. కొరియర్‌ డెలివరీ బాయ్స్‌ దుస్తుల్లో ఈ-బైక్‌పై వచ్చిన దుండగులు పట్టపగలే ఆయనపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలకు తీవ్ర రక్తస్రావం కావడంతో 54 ఏళ్ల మాజీ స్పీకర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.  నిందితులను పట్టుకునేందుకు వేట ప్రారంభించామని, పరిబియ్‌ హత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

మొదట కాల్పలు విషయం తెలిసి ఎవరో ఒక రాజకీయనాయకుడు చనిపోయాడని అనుకున్నారట. కానీ మధ్యంతర మంత్రి ఐహొర్ క్లిమెకో, న్యాయవాది జనరల్ రుస్లాన్ క్రవ్‌చెన్కోలు మరణించింది పరుబియ్ అని నిర్ధారించారు.  2016 నుంచి 2019 వరకూ పరుబియ్ పార్లమెంట్ స్పీకర్‌గా సేవలందించారు. రష్యాకు సానుభూతిపరుడిగా వ్యవహరించిన అప్పటి అధ్యక్షుడు విక్తర్ యనుకొవిచ్‌ కు వ్యతిరేకంగా జరిగిన ఉక్రెయిన్స్ మైదాన్ ఉద్యమంలో పరుబియ్ కీలక పాత్ర పోషించారు.

అలానే ప్రో- యూరోపియన్ ఆరెంజ్ రెవల్యూషన్‌కు ఆయన మద్దతు పలికారు. యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవాలని నినదించిన పరుబియ్ విక్తర్ అధ్యక్ష పీఠం నుంచి వైదొలగడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే, ఆ తర్వాత క్రిమియాను ఆక్రమించుకున్న రష్యా యుద్ధానికి తెరతీసింది.