
తరచూ వివాదాలు సృష్టించే తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలతో కొత్త రాజకీయ దుమారంకు తెరలేపారు. అమిత్ షా బంగ్లాదేశ్ నుండి చొరబాట్లను అరికట్టడంలో విఫలమయ్యారని, ఆయన తల నరికి టేబుల్ మీద పెట్టాలని ఆమె చేసిన వాఖ్యల పట్ల బిజెపి శ్రేణులు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. మొయిత్రా చేసిన “అసహ్యకరమైన, ద్వేషపూరిత వ్యాఖ్యలు” పట్ల మండిపడుతున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడుతూ, సరిహద్దు భద్రతపై కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరిస్తోందని మొయిత్రా ఆరోపించారు. “వారు పదే పదే చొరబాటుదారుల గురించి మాట్లాడుతున్నారు; కానీ భారతదేశ సరిహద్దును ఐదు దళాలు రక్షిస్తాయి. అది నేరుగా హోం మంత్రిత్వ శాఖ బాధ్యత” అని ఆమె గుర్తు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, “ఎర్రకోట వద్ద నిలబడి, చొరబాటుదారులు జనాభా మార్పులకు కారణమవుతున్నారని ప్రధాని స్వయంగా చెప్పారు. కానీ ఆయన ఇలా చెబుతున్నప్పటికీ, ఆయన హోంమంత్రి ముందు వరుసలో నిలబడి, నవ్వుతూ, చప్పట్లు కొడుతున్నారు” అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
“మన సరిహద్దులను రక్షించడానికి మన దగ్గర ఎవరూ లేకపోతే, వేరే దేశం నుండి ప్రజలు ప్రతిరోజూ ప్రవేశిస్తుంటే, చొరబాటుదారులు మన తల్లులు, సోదరీమణులను చూస్తున్నారని, మన భూములను లాక్కుంటున్నారని మన పౌరులు ఫిర్యాదు చేస్తే, మీరు చేయాల్సిన మొదటి పని అమిత్ షా తల నరికి మీ టేబుల్ మీద పెట్టడమే” అని ఆమె ప్రకటించారు.
“హోం మంత్రిత్వ శాఖ, హోం మంత్రి దేశ సరిహద్దులను రక్షించలేకపోతే, ప్రధానమంత్రి స్వయంగా చొరబాటుదారులు మన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పినప్పుడు, తప్పు ఎవరిది? అది మన తప్పా? లేదా మీ తప్పా?” అని కృష్ణానగర్ ఎంపీ ప్రశ్నించారు. సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం ఉన్నప్పటికీ చొరబాటు ఎందుకు కొనసాగుతోందని శ్రీమతి మోయిత్రా ప్రశ్నించారు.
బిజెపి ఆమె “తాలిబానీ మనస్తత్వం, సంస్కృతి”ని విమర్శించింది. బిజెపి పార్టీ కృష్ణానగర్ నార్త్ ఆర్గనైజేషనల్ జిల్లా అధికార ప్రతినిధి సందీప్ మజుందార్, కోల్‌కతాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో మొయిత్రాపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.
“అమిత్ షా శిరచ్ఛేదంపై మహువా మొయిత్రా చేసిన ఐసిస్ తరహా ‘సర్ తన్ సే జుదా’ వ్యాఖ్య స్పష్టమైన నమూనాను చూపిస్తుంది. నఫ్రత్ కే భాయిజాన్ ముహబ్బత్ కీ దుకాన్ కాదు,” అని బిజెపి అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల్లా ట్వీట్ చేశారు. “ఇది ఎలాంటి మనస్తత్వం? జిహాదీ ఉగ్రవాదులు ఇలాగే ఆలోచిస్తారు. చొరబాటుదారులను తొలగించే విషయంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అంతర్యుద్ధం, రక్తపాతం గురించి మాట్లాడుతారు” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఈ అసహ్యకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఆ వ్యక్తి, టిఎంసి మనస్తత్వాన్ని మాత్రమే ప్రతిబింబిస్తాయి. టిఎంసి అధికారిక వైఖరి ఇదేనా? అని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, లేకపోతే వారు క్షమాపణ చెప్పాలి. మొయిత్రాపై చర్య తీసుకోవాలి” అని బిజెపి నాయకుడు రాహుల్ సిన్హా డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ మాట్లాడుతూ, “మహువాను చూసిన తర్వాత, ఇంగ్లీష్ తెలిసిన వ్యక్తి సరైన విద్యావంతుడు కావడం తప్పనిసరి కాదని మీరు తెలుసుకుంటారు” అని మండిపడ్డారు.
ఎఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, అలాంటి వ్యాఖ్యలను నివారించవచ్చని హితవు చెప్పారు. “మేము అమిత్ షాతో మాకున్న విభేదాలను గర్వంగా చెప్పుకుంటున్నాము. మేము దానిని కొనసాగిస్తాము. కానీ అమిత్ షాపై హింసను ఉపయోగించవచ్చా? నేను అలా అనుకోను..” అని స్పష్టం చేశారు.
More Stories
బిహార్ ఎన్నికల్లో వికాసానికి, వినాశనానికి మధ్య పోరు
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
ఆర్ఎస్ఎస్- వామపక్షాలు: ఒకటి అభివృద్ధి? మరొకటి నశించింది?