
ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారత్, చైనా కలిసి పనిచేయడం కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. చైనాతో సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెబుతూ భారత్, చైనా స్నేహం ప్రాంతీయ, ప్రపంచ శ్రేయస్సుకు అవసరమని చైనా పర్యటనకు ముందుగా ప్రముఖ జపాన్ వార్తా పత్రిక యోమియురి షింబున్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనం ఆధారంగా చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని తెలిపారు. భారత్, చైనా స్నేహపూర్వక, ద్వైపాక్షిక సంబంధాలు ప్రపంచ శాంతిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని మోదీ పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో పాల్గొనేందుకు తియాంజిన్ వెళుతున్నానని తెలిపారు. గతేడాది రష్యాలోని కజాన్‌లో జిన్‌పింగ్‌తో సమావేశం అనంతరం భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో స్థిరమైన పురోగతి ఉందని మోదీ పేర్కొన్నారు.
ఈ సమయంలో చైనాతో సంబంధాలను మెరుగుపరచుకోవడం ఎంత ముఖ్యమో అడిగినప్పుడు, ప్రధాని మోదీ మాట్లాడుతూ, “అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు, నేను జపాన్ నుండి టియాంజిన్‌కు వెళ్తున్నాను. గత సంవత్సరం కజాన్‌లో అధ్యక్షుడు జీతో నా సమావేశం నుండి, మా ద్వైపాక్షిక సంబంధాలలో స్థిరమైన, సానుకూల పురోగతి సాధించింది” అని తెలిపారు.
“రెండు పొరుగు దేశాలుగా, భూమిపై రెండు అతిపెద్ద దేశాలుగా భారతదేశం, చైనా మధ్య స్థిరమైన, ఊహించదగిన, స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలు ప్రాంతీయ, ప్రపంచ శాంతి, శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి” అని ప్రధాని చెప్పారు. బహుళ ధ్రువ ఆసియా,బహుళ ధ్రువ ప్రపంచానికి కూడా ఇది చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. “ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత అస్థిరత దృష్ట్యా, ప్రపంచ ఆర్థిక క్రమానికి స్థిరత్వాన్ని తీసుకురావడానికి భారతదేశం, చైనా రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా కలిసి పనిచేయడం కూడా చాలా ముఖ్యం” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యం ఉండాలన్న జపాన్ ప్రభుత్వ వాదన తమ విజన్‌కు అనుగుణంగానే ఉందని తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలతో భారత్-జపాన్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ స్థిరమైన విధానాన్ని కొనసాగిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.
దౌత్యం, చర్చల ద్వారా ఘర్షణకు ముగింపు పలకాలని ఇరు దేశాధినేతలకు తాను ఇప్పటికే సూచించానని మోదీ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం జరిగే ప్రయత్నాలకు భారత్ పూర్తిగా మద్దతిస్తుందని వివరించారు. ఇరు దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఉక్రెయిన్‌లో శాంతి కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని తెలిపారు.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే ఆర్థికంగా వెనుకబడిన దేశాల(గ్లోబల్ సౌత్ దేశాల)కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఇంధన భద్రత, అభివృద్ధి, రుణాలు వంటి అంశాల్లో గ్లోబల్ సౌత్ దేశాలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలను ప్రపంచం ముందు ఉంచటానికి భారత్ తీవ్రంగా కృషి చేస్తోందని తెలిపారు.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
నవంబర్ 5 నుంచి 15 వరకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు!
పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా