తెలంగాణలో వర్షం బీభత్సం

తెలంగాణలో వర్షం బీభత్సం
 
తెలంగాణలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదలకు ఉత్తర తెలంగాణ జిల్లాలు నీట మునిగాయి. ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. భారీ వర్షాల వల్ల పది మంది వరకు చనిపోయి ఉండొచ్చని, మరణాలపై ఇంకా స్పష్టత రాలేదని తెలంగాణ డిజిపి జితేందర్‌ తెలిపారు.  రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న దాదాపు రెండు వేల మందిని రక్షించినట్టు చెప్పారు.
ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌, ఆర్మీ సాయంతో రెండు హెలికాప్టర్ల ద్వారా బాధితులను రక్షించినట్టు ఆయన వివరించారు. రెండు వేల మంది సిబ్బందితో ఎన్‌డిఆర్‌ఎఫ్‌ ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.  సహాయక చర్యల కోసం డయల్‌ 100కు కాల్‌ చేయాలని సూచించారు. వరద ఉధృతికి రహదారులు కొట్టుకుపోయాయి. వరి, మొక్కజొన్న, పత్తి పంటలలు నీటి మునిగాయి. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి.
కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని వందలాది కాలనీలు నీటి మునిగాయి. ప్రజలు దాదాపుగా 40గంటల పాటు ఇండ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కామారెడ్డి పట్టణంలో 12 అడుగులు ఎత్తుతో వరద ప్రవాహం ఉండటంతో ఎన్జీవో కాలనీ, జీఆర్‌ కాలనీలు భయానక పరిస్థితిలో కొట్టుమిట్టాడాయి.
 
నిర్మల్‌, మెదక్‌, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం తీవ్ర ప్రభావం చూపింది. వాగులు, వంకలు పోటెత్తి.. చెరువులు తెగిపోయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, వంతెనలు, రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది. వరద ఉధృతికి రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు స్తంభించిపోయాయి. వందలాది గ్రామాలు జలదిగ్బధంలో చిక్కుకున్నాయి. కరెంటు సరఫరా నిలిచిపోయి అంధకారంలో మగ్గుతున్నాయి.  
కామారెడ్డి-హైదరాబాద్‌ 44వ జాతీయ రహదారి వరద తాకిడికి పలుచోట్ల కోతకు గురవడంతో హైవేపై దాదాపు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కామారెడ్డి-భిక్కనూర్‌ మార్గంలో పట్టాల కింద గండిపడడంతో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్మాల ప్రాజెక్టు వద్ద వరదలో చిక్కుకున్న ఏడుగురు పశువుల కాపర్లను ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో రక్షించాయి. ఎ
స్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది.  ఈ ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో ఎనిమిది లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తుండగా, గేట్లు ఎత్తి అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మధ్య మానేరు, దిగువ మానేరు, ఎగువ మానేరు ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి.