ఏపీ వ్యాప్తంగా 4,472 గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌లు

ఏపీ వ్యాప్తంగా 4,472 గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌లు

ఏపీ వ్యాప్తంగా 4,472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్లను రూ. 1,129 కోట్ల వ్యయంతో  నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది వ్యవధిలో నిర్మాణ పనులనూ పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. నిర్మాణ ప‌నుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే మొత్తం ఖ‌ర్చులో 80 శాతాన్ని కేంద్రమే అందిస్తోందని మంత్రి తెలిపారు. వీటిలో గత ప్ర‌భుత్వం నిర్మాణ ప‌నుల్ని చేప‌ట్టి నిధుల విడుద‌ల‌లో ఆల‌స్యం కార‌ణంగా అసంపూర్తిగా మిగిలిపోయిన 2,309 భ‌వ‌నాల నిర్మాణాల‌ను పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

అలాగే మ‌రో 2,163 నూత‌న భ‌వ‌న నిర్మాణ ప‌నుల్ని పీఎం-అభిం, 15వ ఆర్థిక సంఘం నిధుల‌తో చేప‌ట్టనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు.  రాష్ట్రంలో మ‌రో 1,379 నూత‌న భ‌వ‌నాల‌ను 753 కోట్ల రూపాయల ఖ‌ర్చుతో నిర్మించాల్సి ఉంద‌న్న మంత్రి వీటిని 16వ ఆర్థిక సంఘం నిధుల‌తో చేప‌ట్టేందుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను తీసుకొచ్చింది.

ఒక్కో భవన నిర్మాణానికి రూ.16 లక్షల మేర నిధులు కేటాయించింది. కానీ ఐదేళ్ల పాలనాకాలంలో పూర్తి చేయలేకపోయింది. చాలావరకు అసంపూర్తిగానే నిలిచిపోయాయి. ఫలితంగా లక్ష్యం నీరుగారిపోయింది. ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ (విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌) నిర్మాణాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 

దీంతో కొన్ని గ్రామాల్లో శిథిల గదులు, మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గ్రామీణులకు అరకొర సేవలే అందుతున్నాయి. కొన్నిచోట్ల పనులు పూర్తయినా సిబ్బంది స్థానికంగా ఉండకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి సకాలంలో రాకపోవడంతో అసలు కేంద్రాలే తెరుచుకోవడం లేదు. దీనికితోడు సంబంధిత పీహెచ్‌సీ వైద్యాధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

“గత ప్రభుత్వం అనారోగ్యశాఖగా మార్చేసిన వైద్య ఆరోగ్యశాఖలో సమూల మార్పులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి రాజధాని వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎయిమ్స్‌ తరహా వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తాం. కేంద్రం నుంచి అదనపు నిధులు తీసుకొచ్చి వైద్యసేవలు మెరుగుపరుస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఉచితంగా అందించడమే లక్ష్యంగా కృషి చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య రంగంలో అత్యాధునిక మార్పులు తీసుకొస్తాం” అని సత్య కుమార్ తెలిపారు.