లవ్లీ యూనివర్సిటీలో అమెరికా బ్రాండ్ల పానీయాలపై నిషేధం

లవ్లీ యూనివర్సిటీలో అమెరికా బ్రాండ్ల పానీయాలపై నిషేధం

రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించడం పట్ల దేశంలో పలువురు పలు విధాలుగా తమ ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పెరిగన టారీఫ్‌లు బుధవారం నుంచి అమల్లోకి రావడంతో,  దీనికి నిరసగా పంజాబ్‌లోని ఓ ప్రైవేట్‌ యూనివర్సిటీ అమెరికా ఉత్పత్తులపై నిషేధం విధించింది. తమ క్యాంపస్‌లో అమెరికన్‌ బ్యాండ్ల శీతల పానీయాలను ఇకపై అమ్మేది లేదని స్పష్టం చేసింది. 

అగ్రరాజ్యం అహకారానికి వ్యతిరేకంగా చేపట్టిన స్వదేశీ 2.O ఉద్యమంలో దేశం మొత్తం భాగస్వామ్యం కావాలని పిలుపునచ్చింది. అమెరికా విధించిన 50 శాతం దిగుమతి సుంకాలకు నిరసగా పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ (ఎల్ పియు) తన క్యాంపస్‌లో అమెరికా బ్రాండ్ల పానీయాలపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. కోకా-కోలా, పెప్సీ వంటి బ్రాండ్లు ఉత్పత్తులు ఇకపై విద్యార్థులకు అందుబాటులో ఉండవని తెలిపింది. 

ఈ మేరకు వర్సిటీ ఛాన్సలర్, ఆమ్‌ ఆద్మీ పార్టీ  ఎంపీ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌ వెల్లడించారు. భారతీయ ఉత్పత్తులపై సుంకాలను ఆర్థిక దౌర్జన్యంగా అభివర్ణించిన మిట్టల్‌ భారతదేశం ఎవరి ముందూ తలవందని స్పష్టం చేశారు. ఇది స్వదేశం 2.0 ఉద్యమమని ప్రకటించారు. 

భారతీయ మార్కెట్ నుంచి అమెరికా కంపెనీలు ఏడాదికి రూ.6.5 లక్షల కోట్లకుపైగా ఆదాయాన్ని పొందుతున్నాయి. ఒకవైపు లాభాలు ఆర్జిస్తూ, మరోవైపు ఆంక్షలు విధిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆయన మండిపడ్డారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఇప్పటికీ ఆపని అమెరికా, దాని యూరోపియన్‌ భాగస్వామ్య దేశాలు కేవలం భారత్‌నే లక్ష్యంగా చేసుకున్నాయని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీని నిరసగా 40 వేలమంది విద్యార్థులతో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ వర్సిటీల్లో ఒకటైన తమ ఎల్పీయూ క్యాంపస్‌లలో ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. కాగా, ఈ నిర్ణయాన్ని యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు స్వాగతించారు. సామాజిక మాధ్యమాల్లో స్వదేశీ2.0 (#Swadeshi2.0 ) అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.