ఒకేసారి రెండు దేశీయ యుద్ధనౌకలు ప్రారంభం

ఒకేసారి రెండు దేశీయ యుద్ధనౌకలు ప్రారంభం
ఒకేసారి రెండు దేశీయ యుద్ధ నౌకలను ప్రారంభించి భారత నావికా దళం చరిత్ర సృష్టించింది. రెండు ప్రతిష్టాత్మక షిప్‌యార్డ్‌ల నుండి రెండు ప్రధాన యుద్ధనౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే మొదటిసారి. నౌకాదళానికి చెందిన నీలగిరి శ్రేణి స్టెల్త్‌ ఫ్రిగేట్లు ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి, ఐఎన్‌ఎస్‌ హిమగిరి  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విశాఖపట్టణంలో జరిగిన కార్యక్రమంలో విధుల్లోకి ప్రవేశపెట్టారు. 

ప్రాజెక్టు-17 ఆల్ఫా కింద వీటిని పూర్తిగా దేశీయంగానే నిర్మించారు. సముద్ర రక్షణలో ఇవి భారత నౌకాదళంలో కీలకం కానున్నాయి. అద్భుతమైన ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థలు వీటి సొంతం.  ఐఎన్‌ఎస్‌ నీలగిరి అనే యుద్ధనౌకను ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభించారు. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా 75శాతం స్వదేశీ పరిజ్ఞానంతో హిమగిరి, ఉదయగిరిలను రూపొందించారు. హిమగిరిని కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ మరియు ఇంజనీర్స్‌, ఉదయగిరిని ముంబయిలోని మజగాన్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ నిర్మించాయి. 

ఇవి రెండు అభివృద్ధి చెందుతున్న భారతదేశ నౌక నిర్మాణ నైపుణ్యం, ప్రధాన రక్షణ షిప్‌యార్డ్‌ల మధ్య సమన్వయాన్ని చూపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటితో భారత్‌ ఇప్పుడు దేశీయంగా రూపొందించిన, పారిశ్రామిక-సాంకేతిక సామర్థ్యాన్ని, ప్రాంతీయ శక్తి సమతుల్యతను ప్రదర్శించే మూడు యుద్ధనౌకలను కలిగి ఉంది. “రెండు నౌకలు బహుళ పాత్ర పోషించనున్నాయి. స్వదేశీ యుద్ధనౌక సామర్థ్యానికి ఈ నౌకలు ప్రతీక. ఆత్మనిర్భర్ భారత్‌కి ఈ రెండు నౌకలు నిదర్శనం. సాంకేతిక పరిజ్ఞానం ఈనౌకల తయారీలో ప్రతిబింబిస్తోంది. 2050 నాటికి 200 యుద్ధనౌకలు నిర్మాణం. ఆపరేషన్‌ సిందూర్ ఇంకా ముగియలేదు” అని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు

నీలగిరి శ్రేణిలో ఏడు గైడెడ్‌ మిసైల్‌ ఫ్రిగేట్లను నిర్మిస్తున్నారు. ఇవి ప్రాజెక్ట్‌-17లో నిర్మించిన శివాలిక్‌ శ్రేణి యుద్ధ నౌకలకు కొనసాగింపుగా ఉంటాయి. నీలగిరి, ఉదయగిరి, తారగిరి, మహేంద్ర గిరి యుద్ధ నౌకలను ఎండీఎల్‌, హిమగిరి, దునాగిరి, వింధ్యాగిరిలను జీఆర్‌ఎస్‌ఈ నిర్మిస్తున్నాయి.  వీటి కోసం 75 శాతం భారతీయ పరికరాలు, మెటీరియల్‌నే వినియోగిస్తున్నారు. గతంలో వాడిన లియాండర్‌ శ్రేణి యుద్ధనౌకలకు నీలగిరి శ్రేణివి అప్‌డేట్‌ వెర్షన్‌గా అభివర్ణించవచ్చు.

ఆంధ్ర ప్రదేశ్‌లో నెల్లూరు జిల్లాలోని పర్వత ప్రాంతమైన ఉదయగిరి పేరును వీటిల్లోని ఒక దానికి పెట్టారు.  ఇదే పేరుతో 1976లో కమిషన్‌ అయిన ఒక నౌక ఉంది. అప్పట్లో దానిని శ్రీలంకలో ఆపరేషన్‌ పవన్‌, ఆపరేషన్‌ కాస్టోర్‌, ఆపరేషన్‌ డాల్ఫిన్‌, ఆపరేషన్‌ కాక్టస్‌, ఆపరేషన్‌ మడాడ్‌లో వినియోగించారు. 2007లో ఆ నౌకకు విశ్రాంతి ప్రకటించారు. ఇప్పుడు అదే పేరుతో కొత్త నౌకను ప్రవేశపెట్టారు.

 1974లో ఐఎన్‌ఎస్‌ హిమగిరి పేరిట తొలిసారి యుద్ధ నౌకను నేవీకి అందించారు. వెస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌లో ఇది సేవలు అందించింది. ఆపరేషన్‌ కాక్టస్‌లో పాల్గొంది. బాంబే హై చమురు క్షేత్రం రక్షణ బాధ్యతలను చూసుకొంది. గుజరాత్‌ భూకంపం సమయంలో ఆపరేషన్‌ సహాయతలో పాల్గొంది. 2005లో దీనిని డికమిషన్‌ చేశారు. ఇప్పుడు అదే పేరుతో మరోదానిని తీసుకొచ్చారు.

భారత నౌకదళానికి చెందిన ‘వార్‌షిప్‌ డిజైన్‌ బ్యూరో’ డిజైన్‌ చేసిన 100వ నౌకగా ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి నిలిచింది. భారత్‌లో నిర్మాణం కోసం ఏర్పాటైన దాదాపు 200 సూక్ష్మ, చిన్న, మధ్యపరిశ్రమల సాయంతో వీటి నిర్మాణం జరిగింది. ప్రత్యక్షంగా 4,000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభించిందని రక్షణ శాఖ వెల్లడించింది.