ఓటు చోరీతోనే బీజేపీ గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై మండిపడుతూ ఇది ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లా పర్యటన లో భాగంగా ఇందూర్ లో బూత్ స్థాయి సభ్యుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఏ ఓటర్ జాబితాతో బీజేపీ సభ్యులు గెలిచారో, అదే జాబితాతో కాంగ్రెస్ నాయకులు కూడా గెలిచారని గుర్తు చేశారు.
పైగా, ఏ యంత్రాంగం ఎన్నికలు నిర్వహించిందో, అదే యంత్రాంగం నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా 8 ఎంపీలను గెలిపించుకుందని చెప్పారు. అందుకే కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్, మరోవైపు 10 శాతం మతపరమైన రిజర్వేషన్లు ముస్లింలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. “నేను ముందే చెప్పాను.. స్థానిక ఎన్నికల్లో 46 శాతం రిజర్వేషన్లు బీజేపీ తరఫున బీసీలకే ఇస్తామని. ఎందుకంటే బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వాలి” అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నాయకులు యూరియా కొరత అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రామచందర్ రావు విమర్శించారు. బీజేపీ ఎక్కడా కూడా యూరియా పంపిణీని ఆపలేదని, తెలంగాణకు అవసరమైనంత మేరకు యూరియా సరఫరా చేసిందని తేల్చి చెప్పారు. తెలంగాణలో నడుస్తోంది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ యూరియా కొరత మాత్రమే అని ఆరోపించారు.
తాను పలు జిల్లాల్లో పర్యటించి కలెక్టర్లతో మాట్లాడాను. ఎక్కడా కూడా యూరియా కొరత లేదని వారు చెప్పారని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని, రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగినది కూడా బీఆర్ఎస్ పాలనలోనే అని పేర్కొంటూ అందుకే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని బిజెపి నేత స్పష్టం చేసారు.
కేవలం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నాయని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ వెళ్తున్నారని చెబుతూ వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ తో పాటు బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని, కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆయన మండిపడ్డారు.
ఇందూరు పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ తన జన్మదినం సందర్భంగా దాదాపు రూ.25 లక్షల వరకు ధర్మపురి అర్వింద్ ట్రస్ట్ ద్వారా కార్యకర్తల సంక్షేమం కోసం వితరణ చేశారని రామచందర్ రావు హర్షం ప్రకటించారు. మానవతావాదంతో, బీజేపీ నాయకుడిగా ఒక బాధ్యతతో ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్న అర్వింద్ కు అభినందనలు తెలిపారు.భారతదేశంలో ఏ ఎంపీ చేయలేని సేవలను ధర్మపురి అర్వింద్ గారు ట్రస్ట్ ద్వారా చేస్తున్నారని కొనియాడారు.
రైల్ కనెక్టివిటీని బలపరిచే దిశగా నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో నిర్మాణం చేపట్టిందని తెలిపారు. అనేక జాతీయ రహదారుల నిర్మాణం కూడా ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. అందుకే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో ఓడించి, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపిచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 73, 74వ సవరణల ప్రకారం కేంద్రం ఇస్తున్న నిధులను దారిమళ్లించాయని రామచందర్ రావు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసినప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి భయంతోనే ఎన్నికలు నిర్వహించడం లేదని ధ్వజమెత్తారు. 2028లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేలా తెలంగాణ ప్రజలు మెజారిటీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారని ఆయన చెప్పారు.
More Stories
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు
సామాజిక పరివర్తనే లక్ష్యంగా సంఘ శతాబ్ది
పాక్లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన