లైంగిక ఆరోపణలతో కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే సస్పెండ్

లైంగిక ఆరోపణలతో కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే సస్పెండ్
కేరళలోని పాలక్కాడ్‌ ఎమ్మెల్యే రాహుల్‌ మమ్కూతతిల్ ‌పై లైంకిగ వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపడంతో అతడిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కాంగ్రెస్ సస్పెండ్‌ చేసింది. యువ రాజకీయ నాయకుడు  తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ నటి, మాజీ జర్నలిస్ట్‌ రిని ఆన్‌ జార్జ్‌  ఆరోపించింది. అంతేకాదు పలువురు మహిళలు కూడా ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలే చేశారు. దీంతో కేరళ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంది.
 
ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సస్పెన్షన్ కారణంగా రాహుల్ పార్టీ కార్యక్రమాలు, శాసనసభా పక్ష సమావేశాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది, అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పార్టీ డిమాండ్ చేయలేదు.  ఆరోపణల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, సీనియర్ నేత రమేశ్ చెన్నితాలతో కూడిన నాయకత్వం సుదీర్ఘ చర్చల అనంతరం ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది. పార్టీలోని అంతర్గత ఒత్తిడి, వివాదం పెరగడంతో ఈ చర్య తప్పనిసరి అయింది.

పాలక్కాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు జరిగి పార్టీకి రాజకీయ నష్టం వాటిల్లవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ ఈ ‘డ్యామేజ్ కంట్రోల్’ వ్యూహాన్ని అవలంబించినట్లు సమాచారం. మొదట రాజీనామా చేయించాలని భావించినప్పటికీ, న్యాయ నిపుణుల సలహాతో సస్పెన్షన్‌కే పరిమితమైంది.ఓ ఇంటర్వ్యూలో రిని ఆన్‌ జార్జ్‌ మాట్లాడుతూ ఓ యువ రాజకీయ నాయకుడు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆరోపించింది.

ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేశాను రమ్మంటూ అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఆ యువ నాయకుడు ఎవరన్నది మాత్రం చెప్పలేదు.  పేరు, పార్టీ వంటి వివరాలు చెప్పేందుకు ఆమె నిరాకరించింది. బీజేపీ మాత్రం ఆ యువ రాజకీయ నాయకుడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాహుల్‌ మమ్కూతతిల్ ‌గా తెలిపింది.

ఆ తర్వాత రచయిత్రి హనీ భాస్కరన్‌ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. అందులో మమ్కూతతిల్‌ పేరును ప్రస్తావించారు.  తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, పదేపదే అభ్యంతరకర మెసేజ్‌లు పంపారంటూ ఆమె ఆరోపించారు. యూత్‌ కాంగ్రెస్‌లో ఆయనపై అనేక ఫిర్యాదులు వచ్చాయిని చెప్పారు. కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని హనీ భాస్కరన్‌ ఆరోపించారు.  ఆ తర్వాత ఓ ట్రాన్స్‌ ఉమెన్‌ కూడా రాహుల్‌పై లైంగిక ఆరోపణలు చేసింది.

ఇక ఈ ఆరోపణలతో రాహుల్‌ కేరళ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి పదవికి ఇప్పటికే రాజీనామా కూడా చేశారు. అంతేకాకుండా, ఒక మహిళను అబార్షన్ చేయించుకోవాలని, లేదంటే చంపేస్తానని బెదిరించినట్లుగా ఉన్న ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ ఆడియోలోని గొంతు తనది కాదని రాహుల్ ఖండిస్తున్నప్పటికీ, దానిపై ఫోరెన్సిక్ పరీక్షలు కోరకపోవడం అతనిపై అనుమానాలను మరింత పెంచుతోంది.

మహిళా కమిషన్, బాలల హక్కుల కమిషన్ ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపట్టాయి.  ఈ ఆరోపణలు కేరళ రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. అధికార సీపీఎం, బీజేపీ పార్టీలు రాహుల్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ నాయకత్వం ఈ సస్పెన్షన్ చర్యతో వివాదాన్ని తాత్కాలికంగా చల్లార్చవచ్చని భావిస్తోంది.