
రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అనుమతి పొందిన ప్రతి మండపానికి లైటింగ్, భక్తుల రాకపోకలకు అవసరమైన విద్యుత్ వినియోగం పూర్తిగా ఉచితంగా ఇస్తారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఆదేశాల ప్రకారం ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు (11 రోజులు), అలాగే సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే దుర్గామాత నవరాత్రి వేడుకలు (9 రోజులు) పూర్తిగా ఉచిత విద్యుత్‌తో కొనసాగనున్నాయి. దీని కోసం అన్ని సూపరింటెండింగ్ ఇంజినీర్లు, అకౌంట్స్ అధికారులకు స్పష్టమైన సర్క్యులర్ జారీ చేశారు.
అదనంగా మండపాల నిర్వాహకులు సంబంధిత రిజిస్ట్రేషన్ స్లిప్‌లు సమర్పించాల్సి ఉంటుంది. విద్యుత్ వినియోగానికి సంబంధించిన ఖర్చు లెక్కలు ప్రొఫార్మా-1, ప్రొఫార్మా-2 రూపాల్లో సమర్పించాలని సూచనలు జారీ చేశారు. అయితే విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా జాగ్రత్తలు మరింత కీలకంగా మారాయి. ఇటీవల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కరెంట్ షాక్ కారణంగా విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి.
మండపాల్లో వైర్లు, కనెక్షన్లు సరిగ్గా అమర్చకపోవడం, రక్షణ లేకుండా ప్లగ్ పాయింట్లు వదిలేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి నిర్వాహకులు కచ్చితంగా నాణ్యమైన వైర్లు, ఎర్తింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి, ఫ్యూజ్ వ్యవస్థలు తప్పనిసరిగా వాడాలని అధికారులు సూచిస్తున్నారు. భక్తులు కూడా జాగ్రత్తగా ఉండి, తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కాగా, తెలంగాణ పోలీసులు వినాయక మండపాల నిర్వాహకులకు పలు కీలక నిబంధనలు, హెచ్చరికలను జారీ చేశారు. విగ్రహాల తరలింపు, వినాయక మండపాల ఏర్పాటు, నవరాత్రుల నిర్వహణ, నిమజ్జనం తదితర సమయాల్లో కచ్చితంగా పాటించాల్సిన పలు జాగ్రత్తలను, నియమాలను సూచించారు. గణేశ్ మండపం ఏర్పాటు కోసం ఆన్‌లైన్‌లో పర్మిషన్ తప్పనిసరి. మండపాల కమిటీలు తప్పనిసరిగా పర్మిషన్ కోసం https://policeportal.tspolice.gov.in/index.htm అప్లై చేసుకొని అనుమతి పొందాల్సి ఉంటుంది.
More Stories
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు
తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల