‘గగన్‌యాన్ మిషన్’ ఓ కొత్త అధ్యాయం

‘గగన్‌యాన్ మిషన్’ ఓ కొత్త అధ్యాయం
 * హైదరాబాద్‌ సూర్యోదయాన్ని 16సార్లు చూశా

ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో గగన్ యాన్ మిషన్ ఒక ‘కొత్త అధ్యాయం’ని సూచిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.  గగన్‌యాన్‌ మిషన్‌ కోసం ఎంపికైన నలుగురు గగన్‌ యాత్రీలను సత్కరించేందుకు భారత వాయుసేన (ఐఏఎఫ్‌) ఆదివారం న్యూఢిల్లీలోని సుబ్రతో పార్క్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.  ఈసందర్భంగా నలుగురు గగన్‌ యాత్రీలు శుభాంశు శుక్లా (గ్రూప్‌ కెప్టెన్‌), పీవీ నాయర్‌ (గ్రూప్‌ కెప్టెన్‌), అజిత్‌ క్రిష్ణన్‌ (గ్రూప్‌ కెప్టెన్‌), అంగద్‌ ప్రతాప్‌ (గ్రూప్‌ కెప్టెన్‌)లను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సన్మానించారు.

వ్యోమగామి శుభాన్షు శుక్లా, ఎంపికైన మరో ముగ్గురు గగన్‌యాన్ యాత్రికులు దేశ ‘రత్నాలు’, జాతీయ ఆకాంక్షలకు మార్గదర్శకులుగా అభివర్ణించారు.  శుక్లా జట్టు సభ్యుడిగా ఉండి, భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన విజయవంతమైన ‘ఆక్సియం 4 మిషన్’ తర్వాత ఈ వేడుక జరిగింది. తక్కువ వనరులు ఉన్నప్పటికీ మన దేశం చంద్రయాన్ మొదలుకుని మంగళ్‌యాన్ వరకు అనేక మిషన్‌లు నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.

గగన్‌ యాన్‌ మిషన్‌కు వెళ్లనున్న నలుగురు గగన్‌ యాత్రీలు భారతదేశానికే గర్వకారణమని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కొనియాడారు. ఇందుకోసం వారు చాలా కఠినమైన శిక్షణను పొందారని చెప్పారు. అంతరిక్ష అన్వేషణలో భారత్‌ పెట్టుకున్న లక్ష్యాల సాకారంలో ఈ గగన్‌ యాత్రీలు కీలక పాత్ర పోషించబోతున్నారని ఆయన తెలిపారు.

కాగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి భారత్‌ చాలా అందంగా కనిపించిందని భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా ఈ సందర్భంగా చెప్పారు. ప్రపంచంలోని ప్రత్యేక స్థానంలో, విశిష్ట ఆకారంలో ఉన్నందు వల్లే మన దేశం అలా కనిపించి ఉండొచ్చని తెలిపారు. తాను భారతీయుడిని అయినందున ఈ మాట చెప్పడం లేదని, ఐఎస్‌ఎస్‌లోని ఏ వ్యోమగామిని అడిగినా ఈ విషయాన్నే చెబుతారని ఆయన పేర్కొన్నారు. 
 
ప్రత్యేకించి రాత్రి టైంలో హిందూ మహాసముద్ర మార్గంలో దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు ఐఎస్‌ఎస్‌ వెళ్లేటప్పుడు, భారత్‌ చాలా అద్భుతంగా కనిపిస్తుందని తెలిపారు. తాను చవిచూసిన అనుభూతి గురించి వివరిస్తూ అక్కడి నుంచి తాను రికార్డ్‌ చేసిన భారతదేశం వీడియోను చూపిస్తూ, భూమి ఎగువ వాతావరణంలో ఆక్సిజన్‌ ఆకుపచ్చ కాంతి, నక్షత్రమయ ఆకాశం ఉన్నాయని తెలిపారు. 
హైదరాబాద్‌, బెంగళూరు నగరాలను శుభాంశు శుక్లా ప్రస్తావిస్తూ, ఈ రెండు నగరాల్లో సూర్యోదయం కావడాన్ని ఐఎస్‌ఎస్‌లోని వ్యోమగాములు రోజూ స్పష్టంగా చూడగలుగుతారని చెప్పారు.  ఈ గొప్ప సీన్‌ను వ్యోమగాములు ఒక రోజులో ఏకంగా 16 సార్లు చూడగలుగుతారని, అయినా ఏ ఒక్కసారి కూడా బోర్‌ కొట్టదని తెలిపారు.