బిజెపి అధికారంలోకి రావాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు

బిజెపి అధికారంలోకి రావాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే అధికారంలోకి వచ్చాయని చెబుతూ ఈసారి ప్రజలు బిజెపి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, సీనియర్ జర్నలిస్ట్ ప్రేమ్ శుక్ల తెలిపారు. 
తెలంగాణ బీజేపీ నిర్వహించిన స్థానిక సంస్థల సోషల్ మీడియా – ఐటీ, సోషల్ మీడియా వర్క్‌షాప్‌లో ప్రసంగిస్తూ బాబ్రీ ఉద్యమం నుంచి రామమందిర నిర్మాణం వరకు తెలంగాణ కరసేవకులు పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని కొనియాడారు. 
 
 ఆత్మార్పణతో లక్షలాది తెలంగాణవారు కరసేవలో పాల్గొన్నారని చెబుతూ అదేవిధంగా రానన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు గెలుచుకునేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపిచ్చారు. రేవంత్ రెడ్డి “6 గ్యారంటీలు – 420 హామీలతో” మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని చెబుతూ మభ్యపెట్టే హామీలు, గ్యారంటీలతో వచ్చిన ఈ మోసాలను ప్రజల్లో బహిర్గతం చేయాలని సూచించారు.

రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 50 సార్లకు పైగా ఢిల్లీ వెళ్లి రాహుల్, ప్రియాంక మెప్పుకోసం పనిచేశారని ధ్వజమెత్తారు.  కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వద్ద కోట్ల రూపాయల నగదు, 6 కేజీల బంగారం, విదేశీ కరెన్సీ బయటపడిందని పేర్కొంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇండ్లు, ఆఫీసులు గ్యాంబ్లింగ్ డెన్లుగా మారాయని మండిపడ్డారు.  ఓబీసీ రిజర్వేషన్ల పేరుతో బిజెపిని బద్నాం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కానీ ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధానమంత్రిగా చేసినది బిజెపి మాత్రమే అని స్పష్టం చేశారు.  

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలో, తెలంగాణకు చెందిన బీసీ నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ గారిని రిటర్నింగ్ ఆఫీసర్‌గా నియమించడం  బీసీల పట్ల బిజెపి గౌరవానికి నిదర్శనం అని తెలిపారు.  కాంగ్రెస్ హయాంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పార్థివదేహాన్ని కాంగ్రెస్ పార్టీ తమ కార్యాలయంలోకి కూడా అనుమతించలేదని, ఢిల్లీలో అంతిమ సంస్కారాలు జరగనివ్వలేదని ప్రేమ్ శుక్లా గుర్తు చేశారు. ఇదే బీసీల పట్ల, తెలంగాణ గౌరవం పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యం అని మండిపడ్డారు.

దేశం వేగంగా ఎదుగుతుంటే, తెలంగాణ మాత్రం అప్పులు, నిధుల ఎగవేతలతో ఆర్థికంగా దివాళా తీసిందని విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కీలకం అని చెప్పారు. మీడియా అనేది శక్తివంతమైన వేదిక అని చెబుతూ ప్రతి ఉద్యమంలో, ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా పాత్ర అత్యంత ముఖ్యం అని శుక్లా చెప్పారు.

స్థానిక యూట్యూబ్ చానెల్స్, స్థానిక మీడియా ప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగించాలని, నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణలో చేపట్టిన సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాలని సూచించారు. స్థానిక సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర పథకాలు, అభివృద్ధి పనులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెబుతూ పత్రికలు, న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియాను నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని వివరించారు.

నిరంతరం ప్రజలతో, ముఖ్యంగా స్థానికంగా ప్రభావం చూపగల వ్యక్తులతో (ఉపాధ్యాయులు, డాక్టర్లు, మహిళా సంఘాల నాయకులు, మేధావులు) సత్సంబంధాలు కొనసాగించాలని, వారి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలని చెప్పారు. అధికారిక ప్రెస్ మీట్లలో వ్యక్తిగత అభిప్రాయాలు కాకుండా పార్టీ లైన్ ప్రకారం మాట్లాడాలని హితవు చెప్పారు.

 
కాగా, సోషల్ మీడియా రెండు వైపులా పదునైన కత్తి వంటిది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు  పార్టీ నాయకులను, శ్రేణులను అప్రమత్తం చేశారు. దానిని ఎవరైతే సానుకూలంగా వాడితే వారికి అది శక్తివంతమైన ఆయుధంగా ఉంటుందని, లేనిపక్షంలో నష్టం కలిగిస్తుందని చెప్పారు. 
 
ఎవరైనా తమ పార్టీపై వ్యతిరేక వార్తలు సృష్టించడం, కార్యకర్తల్లో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. పార్టీ చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఇటీవల కొందరు యూట్యూబ్ వీడియోలలో తప్పుదారి పట్టించే విధంగా థంబ్ నైల్స్, మిస్ ఇన్ఫర్మేషన్ వార్తలను పంపిస్తున్నారని, వాటిని పార్టీ కార్యకర్తలు విశ్వసించకూడదని ఆయన సూచించారు.