ఆధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ పరీక్ష విజయవంతం

ఆధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ పరీక్ష విజయవంతం
భువనేశ్వర్‌: అత్యాధునిక ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌ ఢిఫెన్స్‌ వెపన్‌ సిస్టమ్‌ (ఐఏడిడబ్ల్యుఎస్) తొలి విమాన పరీక్షలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) విజయవంతంగా నిర్వహించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన వాయు రక్షణ వ్యవస్థను శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఒడిశా తీరంలో పరీక్షించింది.  వివిధ పొరలతో కూడిన వాయు రక్షణ వ్యవస్థ ఐసీడీడబ్ల్యూఎస్‌  ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థ క్షిపణులు, అధిక శక్తిగల లేజర్‌ ఆధారిత డైరెక్ట్‌ ఎనర్జీ వెపన్స్‌ వ్యవస్థను కలిగి ఉంది.
ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డీఆర్‌ఎస్‌డీఓ, సాయుధ దళాలను ఎక్స్‌ వేదికగా అభినందించారు. ఐఏడీడబ్ల్యూఎస్‌ను ఆగస్టు 23న 12.30 గంటల సమయంలో ఒడిశా తీరం నుంచి డీఆర్‌డీఓ విజయంతంగా పరీక్షించిందని చెప్పారు. ఇది బహుళ అంచెల ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ అని, ఇందులో భారత్‌ అభివృద్ధి చేసిన క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ (క్యూఆర్‌ఎస్‌ఎఎం), అడ్వాన్స్‌డ్‌ వెరీ షార్ట్‌ రేంజ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్ (విఎస్‌హెచ్‌ఒఆర్‌ఎడిఎస్‌) మిసైల్స్‌, హైపవర్‌ లేజర్‌ ఆధారిత డైరెక్ట్‌ ఎనర్జీ వెపన్స్‌ (డిఇడబ్ల్యు) ఉన్నాయన్నారు.
ఐఏడీడబ్ల్యూఎస్‌ను విజయవంతంగా అభివృద్ధి చేసిన డీఆర్డీఓ, సైనిక దళాలను అభినందిస్తున్నానని చెప్పారు. ఈ ప్రత్యేకమైన పరీక్ష బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని తెలియజేసిందని తెలిపారు. శత్రువులు ప్రయోగించే గగనతల ఆయుధాల నుంచి ఆయా ప్రాంతాల రక్షణను ఇది బలోపేతం చేయనుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో రాడార్‌, లాంచర్లు, లక్ష్య, మార్గదర్శక వ్యవస్థలు, క్షిపణులు, కమాండ్‌ అండ్‌ కంట్రోల యూనిట్లు సమగ్ర వైమానిక రక్షణను అందించడానికి ఉన్నాయని చెప్పారు. ఈ  పరీక్ష  విజయవంతం భారతదేశం సాధించిన మరో మైలు రాయి అని కొనియాడారు.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రస్తావించిన ‘సుదర్శన చక్ర’ ఎయిర్ డిఫెన్స్ అభివృద్ధిపై ప్రకటన వెలువడిన కొన్ని రోజులకే ఈ  ఐఏడిడబ్ల్యుఎస్ పరీక్ష విజయవంతం కావడం గమనార్హం. అంతేకాక, కొద్దిరోజుల కిందటే భారత్ ‘అగ్ని-5’ అనే బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీని పరిధి సుమారు 5,000 కిలోమీటర్లు కాగా, మూడు అణు వార్‌హెడ్‌లు మోసుకెళ్లే సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది.