* అనన్య భట్ అదృశ్యం, అత్యాచారం ఆరోపణలు సహితం కల్పితమే!
కర్ణాటకలోని ధర్మస్థల సమీపంలో వందలాది మంది మహిళల మృతదేహాలను పూడ్చానని తప్పుడు ఫిర్యాదులు చేసిన ముసుగు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా, అతడిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బెల్తంగడి కోర్టు ముందు హాజరుపరిచింది. న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన అనంతరం నిందితుడి స్టేట్మెంట్ను వీడియో రికార్డు చేశారు. ఈ సందర్భంగా అతడి ముసుగు తొలగించారు పోలీసులు.
ఇంతకాలం ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచిన పోలీసులు కోర్టులో అతడు మాండ్యకు చెందిన సిఎస్. చిన్నయ్యగా వెల్లడించారు. అతడిని సిట్ బృందం పది రోజుల కస్టడీలోకి తీసుకున్నది. బెల్తంగడీ కోర్టులో అతన్ని ఇవాళ హాజరుపరిచారు. పది రోజుల కస్టడీకి కోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన పారిశుధ్య కార్మికుడు చిన్నయ్యఆరోపణలతో పాటు తన కుమార్తె అనన్య భట్ అదృశ్యమైన్నట్లు ఫిర్యాదు చేసిన సుజాత భట్ ఆరోపణలను సహితం ఈ కేసులో ఉపసంహరించుకున్నారు.
ఫిర్యాదుదారుడు రాసిన లేఖ ప్రకారం 18 పాయింట్లలో 17 ప్రదేశాల్లో సిట్ అధికారులు తవ్వకాలు జరిపారు. కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అతడు చెప్పిన వివరాలు అబద్ధాలని, తప్పుదోవ పట్టించాడని నిర్ధారించింది. గత రెండు దశాబ్ధాల్లో వందల సంఖ్యలో రేప్, మర్డర్ ఘటనలు జరిగాయని, హత్యకు గురైన వారిని ఖననం చేసినట్లు ఆ ఫిర్యాదుదారుడు పేర్కొనడంతో ఆ కేసు సంచలనంగా మారింది. అయితే చివరకు ఓ కళేబరం దొరికినా అది తాను పూడ్చిపెట్టిన వ్యక్తిది కాదు అని అతను చెప్పాడు. పొంతన లేని సమాధానాలు చెప్పిన ఆ ఫిర్యాదుదారుడిని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు.
చిన్నయ్య గతంలో తాను మాస్క్ ధరించి మీడియాతో మాట్లాడాడు. ధర్మస్థలలో జరిగిన హత్యలు, అత్యాచారాల గురించి బయటపెట్టినందుకు తనను చంపేస్తారని భయంతోనే మాస్క్ ధరించినట్లు అప్పట్లో చెప్పాడు. అయితే, అతడి ఆరోపణలు, వెల్లడించిన వివరాలు పూర్తిగా కట్టుకథలని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ తప్పుడు సమాచారం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలిగించినందుకు అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నయ్య అరెస్టుతో ధర్మస్థల కేసులో కొత్త కోణం బయటపడింది.
మాజీ పారిశుద్ధ్య కార్మికుడైన చిన్నయ్య 1995-2014ల మధ్య ధర్మస్థలలో వందల మృతదేహాలను పూడ్చినట్లు జూలై 4, 2025న ధర్మస్థల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాల్లో చాలావరకు స్త్రీలు, మైనర్లు ఉన్నారని, వారిపై అత్యాచారం, హత్య జరిగిన గుర్తులు ఉన్నాయని ఆరోపించాడు. అయితే, ఆగస్టు 23, 2025న అతను తన ఆరోపణలను ఉపసంహరించుకుని, పుర్రెను ఎవరో ఇచ్చారని, తాను దాన్ని సిట్‌కు అందజేశానని చెప్పాడు. దీంతో సిట్ అతడిని అసత్య సాక్ష్యం ఆరోపణలపై అరెస్టు చేసింది.
కేసు దర్యాప్తును దారి మళ్లించేందుకు ఇలాంటి తప్పుడు సమాచారాలు ఇవ్వడం వల్ల దర్యాప్తు బృందం కీలక సమయాన్ని కోల్పోయినట్లైంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిన్నయ్య ఎందుకు ఇలా తప్పుడు సమాచారం ఇచ్చాడనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తుతో నిజాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.
మరోవంక, సుజాత భట్, తన కూతురు అనన్య భట్ 2003లో ధర్మస్థలలో మిస్సైందని, ఆమె అత్యాచారం, హత్యకు గురై ఉండవచ్చని జులై 15, 2025న ఫిర్యాదు చేసింది. ఆమె సీబీఐలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేసినట్లు, తనను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు ఆరోపించింది. అయితే, ఆగస్టు 22, 2025న యూట్యూబ్ ఛానల్ ‘ఇన్సైట్ రష్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తనకు కూతురు లేదని, అనన్య భట్ కథ కల్పితమని, ఆస్తి వివాదం కారణంగా గిరీష్ మట్టన్నవర్, టీ. జయంత్‌లు తనను ప్రేరేపించారని చెప్పింది.
ఆమె చూపించిన ఫొటో కూడా నకిలీదని, తన తాత ఆస్తిని ధర్మస్థల ఆలయ అధికారులు కబ్జా చేశారని ఆరోపించింది. సుజాత చెప్పిన వివరాలను సిట్ పరిశీలించగా, అనన్య భట్ అనే విద్యార్థి మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ కాలేజీలో చదవలేదని, సుజాత సీబీఐలో పనిచేసిన ఆధారాలు లేవని తేలింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెకు కూతురు లేదని, ఆస్తి వివాదం కోసం ఈ కథను సృష్టించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఆమెపై అసత్య ప్రచారం ఆరోపణలతో ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ఫిర్యాదు చేశాడు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం