ఐదేళ్ల తర్వాత భారత్‌-చైనా వాణిజ్య మార్గాలు పునఃప్రారంభం

ఐదేళ్ల తర్వాత భారత్‌-చైనా వాణిజ్య మార్గాలు పునఃప్రారంభం
భారత్, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రెండు దేశాల మధ్య కీలకమైన సానుకూల పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత హిమాలయ ప్రాంతంలోని మూడు కీలక వాణిజ్య మార్గాలను పునఃప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ మేరకు వాణిజ్య కేంద్రాలు  తెరుచుకున్నాయి.  ఈ నిర్ణయం సరిహద్దు ప్రాంతాల ప్రజలకు, టిబెట్ ఆర్థిక వ్యవస్థకు, ఇరు దేశాల సంబంధాలకు ఎంతో ఉపయుక్తం కానుంది. 
ఇటీవల ఢిల్లీలో పర్యటించిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జరిగిన చర్చల సందర్భంగా రెండు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీని ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లోని షిప్కిలా పాస్, ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్, సిక్కింలోని నాథూలా పాస్‌ల ద్వారా వాణిజ్యం పునఃప్రారంభం కానుంది.  ఈ మార్గాలు టిబెట్‌లోని షిగాట్సే, లాసా, నియింగ్చి లాంటి ప్రాంతాలను భారత సరిహద్దు ప్రాంతాలతో కలుపుతాయి.
2020లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఈ మూడు మార్గాలను మూసివేశారు. ఆ తర్వాత ఇరు దేశాల సైనికుల మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు, సైనిక ప్రతిష్టంభన నెలకొనడంతో వీటిని తిరిగి తెరవడంలో ఆలస్యం జరిగింది. వ్యాపారులు ఎప్పటినుంచో కోరుతున్నప్పటికీ పరిస్థితుల కారణంగా ఇన్నాళ్లూ మూసే ఉంచారు. 
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొత్తం ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనా ఆధిపత్యం ఉన్నప్పటికీ, ఈ మూడు సరిహద్దు మార్గాల ద్వారా జరిగే వాణిజ్యంలో మాత్రం భారత్‌దే పైచేయిగా ఉంది. ఎందుకంటే భారత్‌ నుంచి టిబెట్‌కు జరిగే ఎగుమతులు, అక్కడి నుంచి ఇక్కడికి జరిగే దిగుమతుల కంటే ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా మే నుంచి నవంబర్ మధ్య ఈ మార్గాల్లో వాణిజ్య కార్యకలాపాలు జరుగుతాయి. 
 
తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ వాణిజ్య సందడి మొదలుకానుంది. ఈ ట్రేడ్ పోస్టులను ఇరువైపులా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు వాడుకునేవారు. ఈ మార్గాలు చైనా వైపు షిగాట్సె, లాసా, న్యింగ్చిలను చేరుతాయి. కాగా ఈ మూడు వాణిజ్య మార్గాల్లో నాథులా పాస్ అత్యంత రద్దీగా ఉండే మార్గం. వాణిజ్యం, రాకపోకలు అత్యధికంగా ఇక్కడి నుంచే జరుగుతాయి. షిప్కిలా పాస్ ద్వారా వాణిజ్యం పరిమితంగానే ఉంటోంది. లిపులేఖ్ పాస్ ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌ఘడ్‌కు అనుసంధానమై ఉంటుంది. ఈ మార్గంలో రహదారి సౌకర్యం అంత అనువుగా ఉండదు.