వీధి కుక్కలను టీకాలు వేసిన తర్వాత విడిచిపెట్టాలి

వీధి కుక్కలను టీకాలు వేసిన తర్వాత విడిచిపెట్టాలి
డిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లలో ఉన్న వీధి కుక్కలను టీకాలు వేసిన తర్వాత విడిచి పెట్టాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. వీధి కుక్కలను ఉంచేందుకు శాశ్వత షెల్టర్ జోన్లను ఏర్పాటు చేయాలని ఇటీవలే ఇచ్చిన ఆదేశాల్లో ఈమేరకు సుప్రీంకోర్టు కీలక మార్పులు చేసింది.  అయితే ప్రజలను కరిచే స్వభావం కలిగిన, రేబిస్ వ్యాధిగ్రస్థ కుక్కలకు వ్యాక్సినేషన్ చేసి, షెల్టర్ జోన్లలోనే ఉంచాలని స్పష్టం చేసింది. 
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాలను సమీక్షించి ఈమేరకు కొత్త ఆర్డర్స్‌ను జారీ చేసింది.  ఢిల్లీలో ఎక్క‌డ నుంచి తీసుకెళ్లిన కుక్క‌ల‌ను, స్టెరిలైజ్ చేసిన త‌ర్వాత వాటిని అక్క‌డే వ‌దిలేయాల‌ని కోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. వీధి కుక్క‌ల‌ను షెల్టర్ల‌లో వేయ‌డం వ‌ల్ల‌ ఆ షెల్ట‌ర్లు కిక్కిరిసిపోయాయ‌ని, దాని వ‌ల్ల వీధి కుక్క‌ల ఆరోగ్యం ఆందోళ‌న‌క‌రంగా మారిన‌ట్లు కోర్టు వెల్ల‌డించింది.

యానిమ‌ల్ బ‌ర్త్ కంట్రోల్ రూల్స్‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని కోర్టు పేర్కొన్న‌ది. అయితే బ‌హిరంగ ప్ర‌దేశాల్లో వీధి కుక్క‌ల‌కు ఆహారాన్ని అందించ‌డం నిషేధించాల‌ని కోర్టు త‌న తీర్పులో పేర్కొన్న‌ది. వీధి కుక్క‌ల‌కు ఆహారం అందించేందుకు నిర్దేశిత ప్ర‌దేశాల‌ను ఏర్పాటు చేయాల‌ని కోర్టు తెలిపింది.  ఈ నిబంధనను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. 

వీధి కుక్కలకు ఆహారాన్ని అందించేందుకు మున్సిపల్ వార్డుల పరిధిలో ఎక్కడికక్కడ ప్రత్యేక ఫీడింగ్ ఏరియాలను ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది.  వార్డుల పరిధిలో ఉండే వీధి కుక్కల సంఖ్య ఆధారంగా ఎన్ని ఫీడింగ్ ఏరియాలను ఏర్పాటు చేయాలనే దానిపై నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించింది. ఈ అంశంపై స్పష్టమైన జాతీయ విధానానికి దిశానిర్దేశం చేసేందుకుగానూ దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు సంబంధించి నమోదైన పిటిషన్లన్నీ సుప్రీంకోర్టుకే బదిలీ చేయాలని ధర్మాసనం కోరింది.

వీధి కుక్కలకు నియంత్రణ లేకుండా ఆహారం అందించడం వలన అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ధర్మాసనం అభిప్రాయపడింది. ఉల్లంఘించిన వారి వివరాలు తెలిపేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని మునిసిపల్‌ అధికారులను ఆదేశించింది. ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత వ్యక్తులు లేదా ఎన్‌జిఓలపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జంతు ప్రేమికులు సంబంధిత మునిసిపల్‌ అధికారుల ద్వారా వీధికుక్కలను దత్తత తీసుకోవచ్చని, అయితే వాటిని వీధుల్లోకి రాకుండా చూసుకోవడం వారి బాధ్యత అని స్పష్టం చేసింది.