లోక్‌సభ నిరవధిక వాయిదా

లోక్‌సభ నిరవధిక వాయిదా

* ప్రతిపక్ష ఎంపీల తీరుపై స్పీకర్ అసహనం

లోక్‌సభ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభమైనప్పటి నుంచి చర్చలు సజావుగా సాగలేదు. బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై లోక్‌సభలో చర్చ పెట్టాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. సమావేశాలు ప్రారంభమై నేటికి 21వ రోజవుతున్నా  ఎస్‌ఐఆర్‌పై చర్చ పెట్టడానికి అంగీకరించలేదు. దీంతో ప్రతిపక్ష ఎంపీల నిరసనలతోనే సభ గడిచింది. 

గురువారం లోక్‌సభకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. ప్రతిపక్షాలు ఎస్‌ఐఆర్‌పై చర్చకు పట్టుబట్టాయి. దీంతో సభా కార్యకలాపాలు సజావుగా నడిపించలేకపోతున్న ప్రతిపక్షాల తీరుతో స్పీకర్‌ ఓం బిర్లా విసుగెత్తి సభను నేడు నిరవధికంగా వాయిదా వేశారు.  ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్‌ ఓం బిర్లా, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయి. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్​ ఓం బిర్లా. 

ఆ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో నివధికంగా వాయిదా వేశారు. లోక్‌సభ వర్షాకాల సమావేశాల ముగింపు సందర్భంగా నినాదాలు, తగువులు, ప్లకార్డులు ప్రదర్శించడం వంటివి పార్లమెంట్ గౌరవానికి విఘాతం కలిగిస్తున్నాయని స్పీకర్‌ ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారు. సభ్యులంతా మర్యాద, శాంతి, గౌరవం పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తన పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలిగించారని విచారం వ్యక్తం చేశారు.

దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో పెద్దగా చర్చ జరగలేదని, దీనిపై అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జులై 21 నుంచి ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగిశాయి. ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టిన 14 బిల్లుల్లో 12 బిల్లులకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఆపరేషన్‌ సిందూర్‌పై అత్యధికంగా 37 గంటలపాటు జూలై 28, 29 తేదీల్లో ప్రత్యేక చర్చ నడిచింది.

ఆగస్టు 18న భారత అంతరిక్ష కార్యక్రమ విజయాలపై కూడా ప్రత్యేక చర్చ మొదలైనా ప్రతిపక్ష ఎంపీల నిరసనల కారణంగా చర్చ పూర్తికాలేదు.  ఈ సమావేశాల్లో చర్చించాల్సిన జాబితాలో 419 ప్రశ్నలు ఉన్నా, కేవలం 55 ప్రశ్నలపై మాత్రమే చర్చ జరిగింది. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై (ఎస్ఐఆర్) చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్షాలు సభ మొదలైన నాటి నుంచి రోజూ కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి. మరోవైపు ప్రతిపక్షాల నిరసనల మధ్యే కేంద్రం 14 బిల్లులను సభలో ప్రవేశపెట్టగా అందులో 12 బిల్లులకు ఆమోదం తెలిపింది.