లైంగిక ఆరోపణలతో యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజీనామా

లైంగిక ఆరోపణలతో యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజీనామా
మ‌ల‌యాళం చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు మరోసారి కలకలం రేపాయి. ఓ యువ రాజకీయ నాయకుడు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ నటి, మాజీ జర్నలిస్ట్‌ రిని ఆన్‌ జార్జ్‌  ఆరోపించిన మరుసటి రోజే, ఆమె ఆ నాయకుడి పేరు చెప్పనప్పటికీ కేరళ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్యెల్యే, రాహుల్‌ మమ్కూతతిల్‌ పార్టీ పదవికి రాజీనామా చేశారు. 
 
తన రాజీనామాపై ఎలాంటి ఒత్తిడీ లేదని, వ్యక్తిగత బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఎమ్యెల్యేగా కొనసాగనున్నారు.  ఓ టివి ఇంటర్వ్యూలో రిని ఆన్‌ జార్జ్‌ మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా తనకు స్నేహితుడైన ఓ యువ రాజకీయ నాయకుడు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆరోపించింది.  ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేశాను రమ్మంటూ అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేగాక కాంగ్రెస్ లోని పలువురు మహిళా నాయకులు సహితం ఇటువంటి ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే, ఆ యువ నాయకుడు ఎవరన్నది మాత్రం చెప్పలేదు. పేరు, పార్టీ వంటి వివరాలు చెప్పేందుకు ఆమె నిరాకరించింది.  అయితే, నటి ఆరోపణలతో కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని కేరళలోని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ యువ రాజకీయ నాయకుడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాహుల్‌ మంకూటిల్‌గా తెలిపింది. నటి ఆరోపణలతో పాలకజిల్లాలోని ఎమ్మెల్యే కార్యాలయం వెలుపల నిరసనకు దిగింది.
 
ఆ తర్వాత రచయిత్రి హనీ భాస్కరన్‌ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. అందులో మమ్కూతతిల్‌ పేరును ప్రస్తావించారు. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, పదేపదే అభ్యంతరకర మెసేజ్‌లు పంపారంటూ ఆరోపించారు.  పైగా, యువజన కాంగ్రెస్‌లో ఆయనపై అనేక ఫిర్యాదులు వచ్చాయిని చెప్పారు. కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని హనీ భాస్కరన్‌ ఆరోపించారు.  గత ఏడాది పాలక్కాడ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచిన మమ్‌కూటథిల్, ఈ ఆరోపణలపై మొదట్లో స్పందించలేదు. 
అయితే, కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు వి డి సతీశన్ మీడియాతో మాట్లాడుతూ, “పార్టీ ఈ ఆరోపణను పరిశీలించి, నాయకుడి స్థాయిని పరిగణనలోకి తీసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది. ఆరోపించిన సంఘటనలో ఏ కాంగ్రెస్ నాయకుడి ప్రమేయం ఉంటే, పార్టీ కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఈ విషయంలో నేను చొరవ తీసుకుంటాను. మాకు ఇప్పుడే తీవ్రమైన ఫిర్యాదు అందింది. చర్య తీసుకోవడంలో ఆలస్యం జరగలేదు” అని ప్రకటించారు.
 
దానితో పార్టీలో వత్తిడి పెరగడంతో యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయక తప్పలేదు.  పతనంతిట్టలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ మాట్లాడుతూ, “దేశంలోని న్యాయ వ్యవస్థను నేను గౌరవిస్తాను. ఆమె నాకు అత్యంత సన్నిహితురాలు. ఆమె ఈ ఆరోపణలో నా పేరు పెట్టలేదు. ఆమె ఇప్పటికీ నా అత్యంత సన్నిహితురాలు. ఈ ఆరోపణలు నాపై లేవని నేను నమ్ముతున్నాను” అని తెలిపారు. 
 
సీపీఎం ప్రభుత్వం వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో కొన్ని మీడియా సంస్థలు ఈ ఆరోపణలను బయటపెట్టాయని అంటూ ఎదురు దాడికి దిగారు. కాగా, లైంగిక కుంభకోణాలలో పేర్లు ఉన్న నాయకులను రక్షించారనే ఆరోపణలపై సీపీఎంపై పార్టీ దాడి చేయడంతో ఈ ఆరోపణలు కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాయి.  సీపీఎం నాయకుడు పీకే శశి తన పార్టీ సహోద్యోగి నుండి దుష్ప్రవర్తన ఆరోపణలను ఎదుర్కొన్నప్పుడు, ఆయన పార్టీ ఆయనకు మద్దతుగా నిలిచినప్పుడు, సిపిఎం  “పార్టీ నాయకులపై ఫిర్యాదులను అణిచివేస్తోందని,  అలాంటి ఫిర్యాదులలో పార్టీ నాయకులను న్యాయమూర్తులుగా నియమిస్తోందని” కాంగ్రెస్ ఆరోపించింది.