
ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ వంటి ప్రయోజనాలు పొందేందుకు అనర్హులైన రేషన్ కార్డు హోల్డర్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రూపొందించింది. రేషన్ కార్డులు ఉన్న పన్ను చెల్లింపుదారులు, నాలుగు చక్రాల వాహన యజమానులు, కంపెనీల డైరెక్టర్లను ఈ జాబితాలో చేర్చారని తెలిసింది. రేషన్ కార్డులు ఉన్న వారి వివరాలతో ఐటీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డైరెక్టర్లు), రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖ (నాలుగు చక్రాల వాహన యజమానులు) వంటి ప్రభుత్వ విభాగాల డేటాబేస్‌ను సరిపోల్చి ఈ జాబితాను రూపొందించారు.
ఆహార, ప్రజా పంపిణీ విభాగం జరిపిన క్రాస్-వెరిఫికేషన్ కసరత్తులో 94.71 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు, 17.51 లక్షల మంది నాలుగు చక్రాల వాహన యజమానులు, 5.31 లక్షల మంది కంపెనీ డైరెక్టర్లకు రేషన్ కార్డులు ఉన్నాయని తేలింది. మొత్తంమీద రేషన్ కార్డులున్న 1.17 కోట్ల మంది జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఉచితంగా ఆహార ధాన్యాలను పొందేందుకు అనర్హులని అధికారులు తేల్చారు.
ఈ జాబితా ఆధారంగా అవసరమైన క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి సెప్టెంబర్ 30వ తేదీ నాటికి అనర్హులను తొలగించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అనర్హులను తొలగిస్తే వెయిటింగ్ లిస్టులో ఉన్న అర్హులు రేషన్ కార్డులు పొందేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 19వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 19.17 కోట్ల రేషన్ కార్డులు జారీ అయ్యాయి.
దీంతో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం లబ్దిదారుల సంఖ్య 76.10 కోట్లకు చేరింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వోద్యోగులు, వార్షిక ఆదాయం లక్ష రూపాయలు అంతకంటే ఎక్కువ ఉన్న కుటుంబాలు, నాలుగు చక్రాల వాహన యజమానులు, పన్ను చెల్లింపుదారులు ఉచిత ఆహార ధాన్యాలు పొందేందుకు అనర్హులు. రేషన్ కార్డ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఆర్‌సీఎంఎస్) డేటాబేస్‌లో వ్యత్యాసాలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను పునరుద్ఘాటిస్తూ కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల సలహాదారులకు లేఖలు రాశారు.
More Stories
హజారీబాగ్‌లో ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి
జైళ్ల కంటే దారుణంగా బెగ్గర్స్ హోమ్స్
గృహ నిర్మాణం ప్రాథమిక హక్కు