పాక్ గగనతల నిషేధం  పొడిగింపు

పాక్ గగనతల నిషేధం  పొడిగింపు
భారత విమానాలపై ఉన్న గగనతల నిషేధాన్ని పాకిస్తాన్​ మరోసారి పెంచింది. పాకిస్థాన్ విమానాశ్రయాల అథారిటీ, పాక్​ గగనతలంలో భారత విమానాలపై ఉన్న నిషేధాన్ని ఒక నెలపాటు (సెప్టెంబర్​ 23 వరకు) పొడిగిస్తూ నోటీసు జారీ చేసింది. “భారతీయ విమానయాన సంస్థలు నడుపుతున్న అన్ని విమానాలు, పాక్ గగనతలాన్ని ఉపయోగించడానికి అనుమతించబడవు. భారతదేశ యాజమాన్యంలోని, లీజుకు తీసుకున్న సైనిక, పౌర విమానాలన్నింటిపైనా ఈ నిషేధం అమలులో ఉంటుంది” అని పాక్ విమానాశ్రయాల అథారిటీ స్పష్టం చేసింది.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్​-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో ఏప్రిల్​ 23న ఒక నెలపాటు భారత విమానాలు ఏవీ తమ గగనతలంలోకి ప్రవేశించకుండా పాక్​ నిషేధం విధించింది. దీనికి ప్రతీకారంగా ఏప్రిల్ 30న పాక్ విమానాలు ఏవీ భారత గగనతలంలోనికి ప్రవేశించకుండా నిషేధం విధించడం జరిగింది.  తర్వాత మే 23 వరకు, ఆ తరువాత జూన్​ 23 వరకు ఆ నిషేధాన్ని పొడిగించింది.

మరోవైపు పాకిస్థాన్ కూడా ఇలానే చేస్తోంది. తాజాగా పాక్ మరోసారి ఈ నిషేధాన్ని ఒకనెలపాటు పొడిగించింది. దీని ప్రకారం పాకిస్థాన్‌ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన విమానాలతోపాటు, ఆ దేశ సైనిక విమానాలు, లీజుకు తీసుకున్న విమానాలు కూడా భారత గగనతలంలో ప్రవేశించడానికి అవకాశం లేదు. వాస్తవానికి భారత విమానాలపై గగనతల నిషేధాన్ని విధించడం వల్ల పాక్ ఆర్థికంగా​ భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది.

ఆగస్టులో పాక్ రక్షణ మంత్రిత్వశాఖ సమర్పించిన నివేదిక ప్రకారం, ఎయిర్​స్పేస్ మూసివేత వల్ల ఆ దేశానికి దాదాపు రూ.126కోట్ల మేర నష్టం వాటిల్లింది.  అంతేకాదు ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 20 వరకు పాకిస్థాన్​ తమ గగనతలాన్ని మూసివేయడంతో 4.10 బిలియన్ల పాకిస్థాన్​ రూపాయలు (భారత కరెన్సీలో దాదాపు రూ.126 కోట్లు) మేర నష్టం వాటిల్లిందని పాక్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ కూడా పేర్కొంది.