
ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్‌పై నిషేధం విధించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025కు మూజువాణి ఓటుతో బిల్లును బుధవారం ఆమోదించింది. ఈ గేమ్స్ ద్వారా మనీ లాండరింగ్, ఆర్థిక మోసాలు, వ్యసనపరులుగా మారుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేందుకు ఈ బిల్లు తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ బిల్లులో ఆన్‌లైన్ గేమ్స్‌కు సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్లపైనా నిషేధం విధించారు. అలాంటి గేమ్స్‌కు బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థలు నిధులు సమకూర్చకుండా, నిధులు బదిలీ చేయకుండా ఆంక్షలు విధించారు. విపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్ ఈ బిల్లుపై సంక్షిప్త ప్రకటన చేసిన తర్వాత లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. రాజ్యాసభ ఆమోదం కూడా పొందితే ఆన్‌లైన్ బెట్టింగ్ గేములను నేరంగా పరిగణిస్తారు.
“ప్రస్తుత డిజిటల్ టెక్నాలజీలో ఆన్లైన్ గేమింగ్ చాలా కీలకంగా మారింది. ఇందులో మొత్తంగా మూడు సెగ్మెంట్లు ఉండగా, అందులో రెండింటి వల్ల ఎలాంటి నష్టంలేదు. వీటి వల్ల సమాజానికి కూడా ఎంతో లాభం కలుగుతుంది. మూడోదైన ఆన్లైన్ గేమింగ్ సెగ్మెంట్ వల్ల సమాజానికి హానీ కలుగుతుంది. చాలా మంది పిల్లలు, మధ్యతరగతి కుటుంబాలు డబ్బులు పెట్టి మోసపోతున్నాయి. ఫలితంగా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చూస్తున్నాం” అని బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు.
“అందుకే వీటి పరిష్కారంగా మూడేళ్ల పాటు శ్రమించి ఈ బిల్లును తీసుకువచ్చాం. గేమింగ్ ఇండస్ట్రీతో సైతం తీవ్రంగా చర్చించి బిల్లును తెచ్చాం. గేమింగ్ వ్యవస్థలోని మంచిని ప్రోత్సహించి, మోసాలను, వ్యసానాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ బిల్లు ద్వారా భారత్ గేమింగ్ హబ్గా మారుతుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ చేసేవారికి మూడేళ్ల వరకు జైలుశిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా లేదా ఆ రెండూ విధించేలా బిల్లులో నిబంధనలు ప్రతిపాదించారు.
ఆన్‌లైన్ గేమ్స్ అడ్వర్టయిజ్ మెంట్లలో భాగం పంచుకున్న వారికి గరిష్ఠంగా రెండేళ్ల జైలు, 50లక్షల వరకు జరిమానా విధిస్తారు. గేమింగ్ ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయమున్నవారికీ గరిష్ఠంగా మూడేళ్లు జైలుశిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించారు. ఆన్‌లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్థులుగా కాకుండా బాధితులుగా చూడాలని ఈ బిల్లులో తెలిపారు.
చట్టంగా అమలులోకి వస్తే ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, సట్టా , జువాలపై వేటు పడుతుంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో వినోద కాలక్షేప వ్యవహారాలుగా సాగుతున్న పోకర్, రమ్మీ, ఇతర కార్డు ముక్కల ఆటలు, ఆన్‌లైన్ లాటరీలు చట్ట వ్యతిరేకం అవుతాయి. ఆన్‌లైన్ గేమ్స్‌కు బ్యాంకులు, ఆర్థిక సంస్తల నుంచి ఎటువంటి నిధులు సమకూర్చకుండా కట్టుదిట్టమైన ఆంక్షలతో ఈ బిల్లు రూపొందించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు