
గుంతలు పడిన, డ్రైవింగ్ చేయడానికి అనువుగా లేని, ట్రాఫిక్ జామ్ అయిన రహదారులపై వాహనాదారులను టోల్ చెల్లించాలని బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. త్రిస్సూర్ జిల్లాలోని పలియక్కర ప్లాజా వద్ద టోల్ వసూలును నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎస్హెచ్ఏఐ), టోల్ వసూల్ సంస్థ దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది. ఈ క్రమంలో నిలిపివేసిన టోల్ వసూలు వల్ల కలిగే ఆర్థిక నష్టం కంటే పౌరుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇచ్చామని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇటీవల కేరళలోని త్రిసూర్ జిల్లా ఎడప్పల్లి – మన్నుత్తి జాతీయ రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో గంట ప్రయాణానికి కాస్త ఏకంగా 12 గంటలు పట్టింది. దీనిపై స్థానిక మీడియా సైతం పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించింది. ట్రాఫిక్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలో ట్రాఫిక్‌ను కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్రంగా పరిగణించి కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులు 4వారాల పాటు టోల్ చెల్లించవద్దని తీర్పునిచ్చింది. రహదారులు సరిగ్గా నిర్వహించకపోవడం, ట్రాఫిక్ రద్దీ కారణంగా హైవేలోకి ప్రవేశించడానికి అంతరాయం ఏర్పడినప్పుడు ప్రజల నుంచి టోల్ రుసుములు వసూలు చేయలేరని స్పష్టం చేసింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎన్హెచ్ఏఐ, టోల్ వసూల్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. కేరళ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. టోల్ చెల్లించే పౌరుడు మంచి రోడ్లను డిమాండ్ చేసే సంబంధిత హక్కును పొందుతాడనే కేరళ హైకోర్టు అభిప్రాయంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. టోల్ చెల్లించే వారి హక్కు రక్షించకపోతే ఎన్ హెచ్ఏఐ లేదా లేదా దాని ఏజెంట్లు టోల్ చెల్లించమని డిమాండ్ చేయలేరని స్పష్టం చేసింది.
“హైకోర్టు వాదనతో మేము ఏకీభవించకుండా ఉండలేం. చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం ప్రజలు టోల్ ఫ్రీ రుసుము చెల్లించాల్సిన బాధ్యత వారి రహదారి వినియోగం అడ్డంకులు లేకుండా ఉంటుందనే హామీపై ఆధారపడి ఉంటుంది. ఎన్ హెచ్ఏఐ లేదా దాని ఏజెంట్లు అలాంటి సదుపాయాలను వినియోగదారుడి కల్పించడంలో విఫలమైతే ప్రజల చట్టబద్ధమైన అంచనాలను ఉల్లంఘించడమే అవుతుంది” అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
“ఇది టోల్ వ్యవస్థ పునాదిని దెబ్బతీస్తుంది. పౌరులు తాము ఇప్పటికే పన్నులు చెల్లించిన రోడ్లపై ప్రయాణించడానికి స్వేచ్ఛగా ఉండాలి. కాలువలు, గుంతల్లో ప్రయాణించడానికి మరిన్ని పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రాఫిక్ జామ్ అండర్ పాస్‌ల నిర్మాణం జరుగుతున్న బ్లాక్ స్పాట్‌లకే పరిమితం అని ఎన్ హెచ్ఏఐ వాదనను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది.
ప్రధాన క్యారేజ్ వే పనిచేస్తుందని హామీ ఇచ్చినప్పటికీ, గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయిందని వ్యాఖ్యానించింది. రోడ్డు నడపలేని స్థితిలో ఉంటే ప్రయాణికులను టోల్ చెల్లించమని ఎలా అడగగలరని ప్రశ్నించింది. “ఒక వ్యక్తి రోడ్డు ఒక చివర నుంచి మరొక చివర వరకు చేరుకోవడానికి 12 గంటలు పడితే రూ.150 టోల్ ఎందుకు చెల్లించాలి? ఒక గంట ప్రయాణం కాస్త మరో 11 గంటలు అదనంగా పడుతుంది. అలాంటప్పుడు వాహనదారులు ఎందుకు టోల్ చెల్లించాలి!.” అని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు.
More Stories
సామాజిక పరివర్తనే లక్ష్యంగా సంఘ శతాబ్ది
పాక్‌లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్