లోక్‌సభలో ఘర్షణకు తలపడ్డ బిజెపి, టిఎంసి సభ్యులు

లోక్‌సభలో ఘర్షణకు తలపడ్డ బిజెపి, టిఎంసి సభ్యులు
 
* 30 రోజులు జైలులో ఉన్న మంత్రులను తొలగించే బిల్లుపై తీవ్ర గందరగోళం
 
గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు, 2025ను ప్రవేశ పెడుతున్న సందర్భంగా బుధవారం మధ్యాహ్నం లోక్‌సభలో తీవ్ర గందరగోళం చెలరేగడంతో పాటు బిజెపి, టిఎంసి ఎంపిలు దాదాపుగా ఘర్షణకు దిగారు. అవినీతి లేదా తీవ్రమైన నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న, కనీసం 30 రోజులు నిర్బంధంలో ఉన్న కేంద్ర లేదా రాష్ట్ర మంత్రిని తొలగించడానికి ఈ బిల్లు ప్రయత్నిస్తుంది. 
 
ప్రతిపాదిత సవరణ ప్రకారం, ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించదగిన ఆరోపణలపై ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా ఏదైనా మంత్రిని అరెస్టు చేసి 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిర్బంధిస్తే, వారు స్వయంచాలకంగా తమ పదవిని కోల్పోతారు.  దానితో పాటు, జమ్మూ కశ్మీర్‌ పునర్యవ్వస్థీకరణ సవరణ బిల్లు, యూటీల సవరణ బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును, ఇతర బిల్లులను ప్రవేశపెట్టడానికి లేచిన వెంటనే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపిలు నినాదాలు చేస్తూ సభలోని వెల్‌లోకి దూసుకెళ్లారు.  అయితే, ఆ సమయంలో ప్రతిపక్షంలోని ఇతర సభ్యులు వారితో కలవలేదు.  బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడటానికి కాంగ్రెస్ ఎంపిలు లేచి నిలబడి దానిని వ్యతిరేకించారు. కాంగ్రెస్ ఎంపీ కె.సి. వేణుగోపాల్ బిల్లును వ్యతిరేకిస్తూనే, సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షా అరెస్టు అంశాన్ని లేవనెత్తడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. 
అరెస్టుకు ముందే తాను గుజరాత్ హోంమంత్రి పదవికి రాజీనామా చేశానని అమిత్ షా ఈ సందర్భంగా చెప్పడంతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.  దానితో, వేణుగోపాల్ బిల్లును చించి వెల్‌లో విసిరారు. ఆ తర్వాత ఇతర కాంగ్రెస్ ఎంపీలు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ధర్మేందర్ యాదవ్ సహా ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా అదే చేశారు.  దీని తర్వాత, ప్రతిపక్ష ఎంపీలందరూ సభలోని వెల్‌లోకి వచ్చి నినాదాలు చేయడం ప్రారంభించారు.
ఇదంతా జరుగుతుండగా, టిఎంసికి చెందిన కళ్యాణ్ బెనర్జీ, బిల్లుపై షా మాట్లాడుతున్నప్పుడు ఆయన మైక్ దగ్గరికి వచ్చి నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇది చూసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు షా సీటు వద్దకు పరుగెత్తి కోపంగా బెనర్జీని వెనక్కి తగ్గమని కోరారు. ఈ సూచనతో, ట్రెజరీ బీచ్‌లన్నీ టిఎంసి ఎంపీల వైపు కదిలాయి. వారు చాలా దగ్గరగా వచ్చారు, షా స్వయంగా జోక్యం చేసుకోవలసి వచ్చింది. వారందరిని సాంతం వహింపమని కోరారు. 
 
బిల్లు ప్రకారం, తీవ్రమైన ఆరోపణలపై వరుసగా 30 రోజులు కస్టడీలో ఉన్న ఏ మంత్రినైనా ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్/లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుండి తొలగిస్తారు. ముఖ్యమంత్రి తొలగింపుకు సలహా ఇవ్వడంలో విఫలమైతే, ఆ మరుసటి రోజు నుండి మంత్రి పదవిని స్వయంచాలకంగా ఆపివేస్తారు. అదేవిధంగా, ముఖ్యమంత్రిని 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంచితే, అతను 31వ రోజులోపు రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే పదవీకాలం స్వయంచాలకంగా ఆగిపోతుంది.
 
ఆసక్తికరంగా, ఈ నిబంధనల ప్రకారం తొలగించడం వలన ఒక వ్యక్తి శాశ్వతంగా పదవి నుండి నిరోధించబడరని బిల్లు నిర్ధారిస్తుంది. కస్టడీ నుండి విడుదలైన తర్వాత, ప్రస్తుత నియామక నిబంధనల ప్రకారం వారిని తిరిగి ముఖ్యమంత్రిగా లేదా మంత్రిగా నియమించవచ్చు. ఈ మూడు బిల్లులను ప్రవేశపెట్టడం సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. 
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రాల్లోని బిజెపియేతర ప్రభుత్వాలను అస్థిరపరచడమే లక్ష్యంగా పెట్టుకుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం, సమాఖ్య వాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు విపక్షాలు ఆరోపించాయి.  అయితే ఈ బిల్లులను హడావిడిగా తీసుకొచ్చారనే విమర్శలను అమిత్‌ షా తోసిపుచ్చారు.  వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు లోకసభలో తీర్మానం ప్రవేశపెట్టగా ఆ తీర్మానానికి దిగువ సభ ఆమోదం తెలిపింది. 
తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ నాయకులు రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో కొనసాగడం తగదని అమిత్‌ షా స్పష్టం చేశారు.  అయినా ఆ మూడు బిల్లులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. స్పీకర్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సభ్యులు పట్టించుకోలేదు. దాంతో సభను ముందుగా మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో సాయంత్రం 5 గంటల వరకు వాయిదా వేశారు.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కట్టబెట్టిన ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆరేళ్లు కావొస్తోంది. 2019 ఆగస్టు 5న ఈ ఆర్టికల్‌ను తొలగించి.. జమ్ము కశ్మీర్, లద్ధాఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది కేంద్రం. తిరిగి జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కట్టబెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది. ఈ క్రమంలోనే బుధవారం లోక్‌సభలో జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.